రాష్ట్రంలో ఉపాధి కరువైంది

23 Nov, 2015 04:01 IST|Sakshi

యువత నిరాశలో ఉంది: టీజేఏసీ చైర్మన్ కోదండరాం
 చెన్నూర్: తెలంగాణలో ఉపాధి అవకాశాలు కరువయ్యాయని, పల్లెలు, పట్టణాల్లో యువత నిరాశతో ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే వరకు ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సాధనబోయిన కృష్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి అధ్యక్షతన కోదండరాంకు పౌర సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కరువయ్యాయని అన్నారు. ‘‘జేఏసీ ఏ పార్టీకి సంబంధించింది కాదు. ప్రజా సమస్యలే జేఏసీ అజెండా. తెలంగాణ ఉద్యమాన్ని మొట్టమొదటి సారిగా ఇక్కడ్నుంచే ప్రారంభించాం. అభివృద్ధి కోసం చేసే పోరాటాన్ని సైతం చెన్నూర్ నుంచి ప్రారంభిస్తాం’’ అని అన్నారు.

ఈ సన్మానం తనకు కాదని, తెలంగాణ ప్రజలందరికీ అని చెప్పారు. ఓపెన్ కాస్ట్ గనులతో అభివృద్ధికి విఘాతం కలుగుతోందని, భూగర్భ గనులు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఫారెస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మూల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేది క రాష్ర్ట అధ్యక్షుడు గురిజాల రవీందర్ మాట్లాడారు. అనంతరం వానమామలై వరదాచార్యుల జయంతి ఉత్సవాల సందర్భంగా రేవెల్లి రామయ్య రాసిన పాటల సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉద్యోగ, మైనార్టీ, ప్రజాప్రతినిధులు, పలువురు సర్పంచ్‌లు, న్యాయవాదులు,సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు కమ్మల శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు