నా ఆటతోనే నిరూపిస్తా

23 Nov, 2015 03:58 IST|Sakshi
నా ఆటతోనే నిరూపిస్తా

పునరాగమనంపై ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం ఎప్పుడనేది తన ప్రదర్శనే చెబుతుందని భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. దీని గురించి తాను మాట్లాడటం కంటే ప్రదర్శనపై ఎక్కువగా దృష్టిపెట్టానని చెప్పాడు. ‘పునరాగమనం గురించి ఎక్కువగా మాట్లాడి నా దృష్టిని మరల్చుకోలేను. ప్రస్తుతానికి బరోడా తరఫున నా సత్తా మేరకు రాణించాలని భావిస్తున్నా. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.

అలాగే నా అనుభవాన్ని జట్టు సభ్యులతో పంచుకుంటా. నా ప్రదర్శనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చే అంశాన్ని చెబుతుంది’ అని పఠాన్ పేర్కొన్నాడు. 2012లో భారత్ తరఫున చివరి వన్డే ఆడిన ఇర్ఫాన్ చాలా కాలం తర్వాత మళ్లీ రంజీల్లో బరిలోకి దిగాడు. గతవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు చేయడంతోపాటు 6 వికెట్లూ తీసి జట్టును గెలిపించాడు.

అయితే ఇప్పుడు ఆల్‌రౌండర్ పాత్రపై ఎక్కువగా దృష్టిపెట్టానని చెప్పాడు. ఇందుకోసం ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే బాగా మెరుగుపడొచ్చన్నాడు. క్రీడాకారుడి జీవితంలో గాయాలు చాలా సాధారణం కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.
 
కోహ్లి కెప్టెన్సీ భిన్నం
గంగూలీ, ద్రవిడ్, ధోనిల నాయకత్వంతో పోలిస్తే కోహ్లి కెప్టెన్సీ భిన్నంగా ఉందని ఇర్ఫాన్ అన్నాడు. ప్రస్తుత టెస్టు జట్టుకు ఇది మంచి చేస్తుందన్నాడు. ‘ప్రతి కెప్టెన్ పనితీరు భిన్నంగా ఉంటుంది. నేను ఆడిన కెప్టెన్లందరూ భిన్నమైన వైఖరి కలిగి ఉన్నవారే. కెప్టెన్‌కు తగ్గట్టుగానే జట్టు స్పందన కూడా ఉండేది.

ఓవరాల్‌గా జట్టును నడిపించడం మొత్తం నాయకుడిపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైతే విరాట్ టీమ్‌ను బాగా నడిపిస్తున్నాడు. లంకపై, దక్షిణాఫ్రికాపై అద్భుతంగా గెలిపించాడు. అతని కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అని ఈ బరోడా పేసర్ వ్యాఖ్యానించాడు.

>
మరిన్ని వార్తలు