అత్యవసర సేవల కోసం 112

24 Aug, 2015 02:50 IST|Sakshi
అత్యవసర సేవల కోసం 112

* దేశ వ్యాప్తంగా ఒకే నంబర్
* అన్ని సేవలు దాని పరిధిలోకే

సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలన్నీ ఒక్కతాటిపైకి రానున్నాయి. దీని కోసం కేంద్ర హోం శాఖ.. నేషనల్‌వైడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం(ఎన్‌ఈఆర్‌ఎస్) పేరుతో మైక్రో మిషన్ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే ‘112’ నంబర్‌ను టెలికం శాఖ కేటాయిం చింది. రాష్ట్రాల్లో అమలులో ఉన్న 100, 108 తదితర ఎమర్జెన్సీ నంబర్లను దీని పరిధిలోకి తీసుకురానున్నారు.

ప్రస్తుతం రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్న కేంద్ర హోం శాఖ వీలైనంత త్వరలో దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ఏర్పాటులో భాగంగా దేశవ్యాప్తంగా 36 చోట్ల 24 గంటలూ పని చేసే కంట్రోల్ రూమ్ తరహా కాల్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది.
 
అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో సేవలు
ప్రస్తుతం కంట్రోల్‌రూమ్‌కు ఓ కాల్ వచ్చిన వెంటనే అది ఏ ప్రాంతం నుంచి వస్తోంది అనేది గుర్తించేందుకు కొంత పరిజ్ఞానం పోలీసుల వద్ద ఉంది. ఎన్‌ఈఆర్‌ఎస్ అమలుతో మరింత అత్యాధునికమైన పరిజ్ఞానం చేకూరుతుంది. ఇది అందుబాటులోకి వస్తే జీఐఎస్(జియోగ్రాఫిక్ ఇన్‌ఫర్‌మేషన్ సిస్టమ్) పరిజ్ఞానంతో కూడిన వీడియో వాల్స్ కంట్రోల్ రూమ్స్‌లో ఉంటాయి. బాధితులు ఏ ప్రాంతం నుంచి ఫిర్యాదు చేస్తున్నారనేది దీని ద్వారా తక్షణం గుర్తించే అవకాశం ఉంటుంది. రక్షక్, మొబైల్ వాహనాల్లో జీపీఎస్ ఉంటుంది కాబట్టి బాధితుడికి దగ్గరలో ఉన్న వాహనాన్ని వెంటనే  పంపిస్తారు.
 
కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి భాగసామ్యం
ఎన్‌ఈఆర్‌ఎస్ వ్యవస్థ కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంతో పని చేయనుంది. మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రం అందిస్తుండగా... వీటిలో పని చేసే సిబ్బంది, పోలీసులకు అవసరమైన వాహనాలు తదితరాలను రాష్ట్రం కేటాయించాల్సి ఉంటుంది. సిబ్బందిని రిక్రూట్‌మెంట్, ఔట్‌సోర్సింగ్ ద్వారా ఏర్పాటు చేసుకోనున్నారు. వాహనాలు, ఇతర సౌకర్యాలను కేంద్రం అందించే వివిధ పథకాల కింద సమీకరించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను రాజధాని ప్రాంతమైన విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగానిర్ణయించారు.

మరిన్ని వార్తలు