వైద్య విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన క్యాబ్‌ డ్రైవర్‌

8 Jul, 2017 21:02 IST|Sakshi
వైద్య విద్యార్థిని కిడ్నాప్‌ చేసిన క్యాబ్‌ డ్రైవర్‌

– ప్రత్యేక బృందంతో గాలిస్తున్న ప్రీత్‌ విహార్‌ పోలీసులు
– బాధితుడిది తెలంగాణలోని గద్వాల్‌న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తెలుగు వైద్య విద్యార్థిని ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ కిడ్నాప్‌ చేసిన ఉదంతం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని గద్వాల్‌లోని మోమిన్‌మహళ్ల ప్రాంతానికి చెందిన జనార్థన్‌ గౌడ్‌, భారతమ్మ దంపతుల కుమారుడ అక్కాల శ్రీకాంత్‌ గౌడ్‌(29) చైనాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. అనంతరం పీజీ మెడిసిన్‌ చేస్తూ ఢిల్లీలోని ప్రీత్‌ విహార్‌లో ఉన్న మెట్రో ఆస్పత్రిలో ప్రాక్టీస్‌ చేస్తున్నారు.  గురువారం రాత్రి ఆస్పత్రిలో విధులు పూర్తి చేసుకున్న అనంతరం శ్రీకాంత్‌  తన స్నేహితులతో కలిసి ఒక హోటల్‌లో భోజనానికి వెళ్లారు. అనంతరం శ్రీకాంత్‌ ఒక్కడే దక్షిణ ఢిల్లీలో ఉన్న తన నివాసానికి వెళ్లడానికి ఓలా క​‍్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు.

ఈ క్రమంలో  మార్గం మధ్యలో క్యాబ్‌ డ్రైవర్‌ శ్రీకాంత్‌ను కిడ్నాప్‌ చేశాడు. తన దగ్గర ఉన్న ఫోన్‌ను లాక్కుని స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. ఓలా యాజమాన్యానికి ఫోన్‌ చేసి తాను వైద్య విద్యార్థిని కిడ్నాప్‌ చేశానని తెలిపాడు. అతన్ని విడుదల చేయాలంటే రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో ఓలా యాజమాన్యం శుక్రవారం ప్రీత్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గురువారం రాత్రి నుంచి శ్రీకాంత్‌  ఆచూకీ లభించకపోవడంతో అతని సహచరుడు డాక్టర్‌ హేమంత్‌ కూడా ప్రీత్‌ విహార్‌ పోలీసులను ఆశ్రయించాడు. రాత్రి 10 గంటలకు అతనితో ఫోన్‌లో మాట్లాడానని, తరువాత ఫోన్‌ అందుబాటులోకి రాలేదని హేమంత్‌ తెలిపాడు.

ఈ రెండు ఫిర్యాదులు ఒక్కటేనని నిర్దారించుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందంతో గాలింపు ప్రారంభించారు. ఓలా డ్రైవర్‌ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. క్యాబ్‌లోఉన్న జీపీఎస్‌ ఆధారంగా వాహనాన్ని గుర్తించడానికి ఓలా యాజమాన్యం, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రీత్‌ విహార్‌ ఏసీపీ రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ.. క్యాబ్‌ డ్రైవర్‌ ఆచూకీ కనుగొనేందుకు ప్రేత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాంత్‌ కిడ్నాప్‌ గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే వారు ఢిల్లీకి బయలుదేరారు.