మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి

5 Jun, 2015 08:43 IST|Sakshi

దాడి వెనుక తీవ్రవాద సంస్థలు పీఎల్‌ఏ, కేవైకేఎల్‌ల హస్తం!
గత ఇరవై ఏళ్లలో ఆర్మీపై జరిగిన భారీ దాడి ఇదే
18 మంది సైనికుల మృతి; 11 మందికి గాయాలు  
ప్రధాని మోదీ, రక్షణ మంత్రి పారికర్‌ల ఖండన
ఇంఫాల్/న్యూఢిల్లీ: మణిపూర్‌లో మిలిటెంట్లు ఘాతుకానికి తెగబడ్డారు. ఆర్మీ వాహన శ్రేణిపై మందుపాతరలు, గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో మెరుపుదాడి చేసి 18 మంది సైనికుల ప్రాణాలు తీశారు.

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 80 కి.మీ.ల దూరంలో ఉన్న తెంగ్నౌపాల్- న్యూ సంతాల్ రోడ్‌పై ఈ దాడికి పాల్పడ్డారు. గురువారం ఉదయం డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సైనికులు నాలుగు వాహనాల్లో పెట్రోలింగ్‌కు బయల్దేరారు. పారలాంగ్, చరాంగ్ గ్రామాల మధ్యకు రాగానే ఆ వాహన శ్రేణిపై శక్తిమంతమైన మందుపాతరను పేల్చిన మిలిటెంట్లు.. ఆ వెంటనే రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు, అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులతో సైనికులపై విరుచుకుపడి, విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు.

ఆ దాడిలో 18 మంది సైనికులు చనిపోగా, 11 మంది గాయాల పాలయ్యారు. ఒక అనుమానిత ఉగ్రవాది కూడా చనిపోయాడని సమాచారం. ఈ దాడి తామే చేశామంటూ ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ ఈ దాడి వెనుక మణిపూర్‌కు చెందిన తీవ్రవాద సంస్థలు ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)’, ‘కంగ్లీ యావొల్ కన్నా లుప్(కేవైకేఎల్)’ల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నామని మణిపూర్ హోం శాఖ కార్యదర్శి జే సురేశ్ బాబు పేర్కొన్నారు. దాడి జరిగిన సమాచారం తెలియగానే మరిన్ని దళాలను సంఘటనా స్థలానికి పంపించామని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ రోహన్ ఆనంద్ తెలిపారు.

క్షతగాత్రులను హెలికాప్టర్ల ద్వారా నాగాలాండ్‌లోని ఆసుపత్రికి తరలించామన్నారు.  సంఘటన స్థలం భారత్, మయన్మార్ సరిహద్దుకు దాదాపు 15 కి.మీ.ల దూరంలో ఉంది. కేవైకేఎల్ స్థానిక మీతీ ప్రజలకు సంబంధించిన తీవ్రవాద సంస్థ. ఆర్మీపై గత ఇరవై ఏళ్లలో జరిగిన భారీ దాడి ఇదే. సాధారణంగా ఇలాంటి దాడులు జమ్మూకశ్మీర్లో 90వ దశకంలో ఎక్కువగా జరుగుతుండేవని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.
 
మతిలేని చర్య.. మోదీ: మిలిటెంట్ల దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖం డించారు. ఈ దాడిని మతిలేని చర్యగా అభివర్ణించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఘనంగా నివాళలర్పించారు. ‘ఈ రోజు మణిపూర్లో జరిగిన అర్థంలేని దాడి చాలా బాధాకరం. ఈ దాడిలో దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతీ ఒక్క సైనికుడికి శిర సు వంచి ప్రణామాలర్పిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మిలిటెంట్ల దాడి ని రక్షణమంతి మనోహర్ పారికర్ కూడా ఖండించారు. ఇది పిరికి చర్య అని, ఈ దారుణానికి పాల్పడినవారిని శిక్షించి తీరతామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మిలిటెంట్ల దాడిపై హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సైనికులు చేసిన త్యాగం వృథా పోదని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దాడికి పాల్పడిన మిలిటెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిలిటెంట్ల దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు