చైనాలో బయటపడ్డ బుద్ధుడి అవశేషాలు

4 Jul, 2016 20:37 IST|Sakshi
చైనాలో బయటపడ్డ బుద్ధుడి అవశేషాలు
బీజింగ్: చైనాలోని నాంజింగ్ నగరంలోని ఓ బౌద్ధాలయంలో గౌతమ బుద్ధుడి అవశేషాలు దొరికాయని చైనా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వెయ్యి ఏళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఓ బాక్సులో గౌతమ బుద్ధుడి కపాలంలోని ఓ పార్శపు ఎముక దొరికందనేది వారి వాదన. ఎర్రచందనం, బంగారం, వెండితో తయారు చేసిన నాలుగు అడుగుల పొడవు, ఒకటిన్నర అడుగుల బాక్సులో ఇతర బౌద్ధ సన్యాసుల అవశేషాలతోపాటు బుద్ధుడి కపాల భాగం దొరికిందని వారు తెలిపినట్లు ఓ చైనా సాంస్కృతిక పత్రికలో ఇటీవల పేర్కొన్నారు. బాక్సు దొరికన రాతి ఫలకం మీద ఆలయాన్ని నిర్మించిన వారి పేరుతోపాటు అవశేషాలున్న వారి పేర్లను కూడా చెక్కారని, దాని ద్వారా అందులో బుద్ధిడి అవశేషాలు ఉన్నట్లు స్పష్టమవుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
2010లో జరిపిన తవ్వకాల్లోనే ఈ అవశేషాలు బయటపడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ప్రజల దృష్టికి రావడంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందో ఎవరూ చెప్పడం లేదు. హిరన్నవతి నదీ తీరం వద్ద బుద్ధుడి అంత్యక్రియలు జరిగాయని, అప్పుడు సేకరించిన ఆయన ఎముకల్లో 19 ఎముకలు చైనాకు చేరాయని ఆ శిలాఫలకంపై ఉన్న రాతల ద్వారా తెలుస్తోంది.
 
11వ శతాబ్దానికి చెందిన జెంగ్‌జాంగ్ అనే రాజు అప్పటికే శిథిలమైన ఆలయం చోట ఈ బుద్ధుడి అవశేషాలున్న బాక్సును, శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి బౌద్ధాలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2010లో అక్కడ జరిపిన తవ్వకాల్లో బంగారు, వెండితో తయారు చేసిన ఓ స్థూపం కూడా దొరికిందని, ఆ స్థూపం ముందు కూర్చొని బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసే వారని వారంటున్నారు. 
మరిన్ని వార్తలు