కాంగ్రెస్‌పై ‘ఇందిరమ్మ’ అస్త్రం!

27 Sep, 2015 04:50 IST|Sakshi
కాంగ్రెస్‌పై ‘ఇందిరమ్మ’ అస్త్రం!

♦ వారి హయాంలో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగినట్లు తేల్చిన సీఐడీ
♦ ఈ నివేదికతో విపక్షంపై ఎదురుదాడికి సర్కారు సమాయత్తం
♦ అసెంబ్లీ సమావేశాల్లో ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు వ్యూహం
 
 సాక్షి, హైదరాబాద్ : శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ఎదురుదాడికి అధికారపక్షం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్  హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో అక్రమాలపై సభలో నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోం ది. నాటి అవకతవకలపై విచారణ జరిపి సీఐడీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎదురుదాడి చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. కాంగ్రెస్ హయాంలో ఇళ్ల నిర్మాణంలో అవినీతిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, గృహనిర్మాణ శాఖ మాజీ మంత్రి అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలను సీఐడీ అందులో పొందుపరిచింది.

మొదటి విడత విచారణలో 60 మంది అధికారులను బాధ్యులుగా తేల్చింది. అనర్హులకు ఇళ్లు కట్టబెట్టడం, ఒకే కుటుంబానికి వేర్వేరు కుటుంబ సభ్యుల పేర్లతో రెండు అంతకంటే ఎక్కువ యూనిట్లు మంజూరు చేయడం, ఇళ్లు నిర్మించకపోయినా బిల్లులు మంజూరు చేయడం వంటి అక్రమాలకు ఈ 60 మంది అధికారులు పాల్పడినట్లు సీఐడీ నిర్ధారించింది. స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్లమేరకు అధికారులు తప్పిదాలకు పాల్పడినట్లు పేర్కొంది. జానారెడ్డి నియోజకవర్గం లోని అనుముల మండలంలో ఇళ్లు నిర్మించకుండానే కొందరికి బిల్లులు ఇచ్చారని, ఒకటి కంటే ఎక్కువ యూనిట్లు మంజూరైన వారు మరికొందరు ఉన్నారని తేల్చింది.

ఉత్తమ్‌కుమార్ గతంలో ప్రాతినిధ్యం వహించిన కోదాడ, డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న గద్వాల నియోజకవర్గంలోనూ అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారించింది. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి గత 20 ఏళ్ల గణాంకాలను సిద్ధం చేసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలతో కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టేందుకు వ్యూహ    రచన చేస్తోంది.

 అక్రమార్కులపై క్రిమినల్ కేసులు?
 బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొదటివిడతలో 9 జిల్లాల్లోని 36 గ్రామాల్లో సీఐడీ విచారణ జరిపింది. భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేల్చి 60 మంది అధికారులను బాధ్యులుగా చేసింది. వీరితో పాటు పలువురు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ నేతల అక్రమాలకు సంబంధించి ఆధారాలు సేకరించింది. బాధ్యులైన అధికారులను ప్రశ్నించడం ద్వారా తమపై ఒత్తిడి తెచ్చిన రాజకీయ నేతల పేర్లు వారితో చెప్పించింది.

వారిలో ప్రతిపక్ష నేత జానారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొదట తప్పులకు పాల్పడిన ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ సూపర్‌వైజర్లపై కేసులు నమోదు చేయాలా లేదా అన్న విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. వారిపై కేసులు నమోదు చేస్తే ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముందని భావిస్తోంది. ‘కేసులు నమోదు చేసే విషయం ఎలా ఉన్నా, కాంగ్రెస్ అక్రమాలను అసెంబ్లీలో ఎండగడతాం. వారి అక్రమాల చిట్టా బయటపెడతాం’ అని సీనియర్ మంత్రి ఒకరు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు