బ్యాంక్ స్ట్రీట్...

1 Nov, 2013 02:34 IST|Sakshi


 10 శాతం క్షీణించిన బీవోబీ నికరలాభం
 ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా నికరలాభం 10 శాతం క్షీణించి రూ.1,168 కోట్లుగా నమోదయ్యింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలానికి నికరలాభం రూ.1,301 కోట్లుగా ఉంది. మొండి బకాయిల ప్రొవిజనింగ్ కేటాయింపులకు అధిక మొత్తం కేటాయించడంతో లాభాలు తగ్గినట్లు బ్యాంకు పేర్కొంది. గడిచిన ఏడాది ప్రొవిజనింగ్ కింద రూ.646 కోట్లు కేటాయిస్తే అది ఈ ఏడాది రూ.861 కోట్లకు పెరిగాయి. సమీక్షా కాలంలో ఆదాయం రూ.9,551 కోట్ల నుంచి రూ.10,447 కోట్లకు పెరిగింది. అలాగే స్థూల నిరర్థక ఆస్తులు 1.98% నుంచి 3.15%, నికర నిరర్థక ఆస్తులు 0.82% నుంచి 1.86% పెరిగాయి.
 
 బీవోఐ లాభం రెండు రెట్లు అప్..
 ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక నికర లాభం రెండు రెట్లు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.302 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.622 కోట్లకు పెరిగింది. నిరర్థక ఆస్తులు భారీగా తగ్గడంతో ఆ మేరకు లాభాలు పెరిగినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.8,899 కోట్ల నుంచి రూ.10,339 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో స్థూల నిరర్థక ఆస్తులు 3.42% నుంచి 2.93%, నికర నిరర్థక ఆస్తులు 2.04% నుంచి 1.85% తగ్గాయి. ఫలితాలు బాగుండటంతో గురువారం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ఏకంగా 21% పెరిగి రూ.210 వద్ద ముగిసింది.
 
 
 భారీగా తగ్గిన యూనియన్ బ్యాంక్ లాభం
 ముంబై: సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికరలాభం 62% క్షీణించింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.554 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.208 కోట్లకు పడిపోయింది. ప్రొవిజనింగ్ కోసం గతేడాది రూ.487 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.937 కోట్లు కేటాయించాల్సి రావడంతో నికరలాభం భారీగా తగ్గినట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో ఆదాయం రూ.6,656 కోట్ల నుంచి రూ.7,882 కోట్లకు పెరిగింది. నికర నిరర్థక ఆస్తులు 2.06 శాతం నుంచి 2.15 శాతానికి పెరిగాయి.
 
 అలహాబాద్ బ్యాంక్ నికరలాభం18% వృద్ధి
 న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం(2013-14, క్యూ2)లో ప్రభుత్వరంగ అలహాబాద్ బ్యాంక్ నికరలాభం 18 శాతం వృద్ధి చెందింది. రూ. 234 కోట్ల నుంచి రూ.276 కోట్లకు చేరింది. ఆదాయం రూ.4,583 కోట్ల నుంచి రూ.5,303 కోట్లకు పెరిగింది. ఈ సమీక్షా కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు 2.95 శాతం నుంచి రూ.4.94 శాతానికి, నికర నిరర్థక ఆస్తులు 2.10 శాతం నుంచి 3.83 శాతానికి పెరిగాయి.
 
 

మరిన్ని వార్తలు