పరువు కన్నా ప్రాణం మిన్న!

20 May, 2015 15:54 IST|Sakshi
పరువు కన్నా ప్రాణం మిన్న!

(సాక్షి వెబ్ ప్రత్యేకం)
దేశం ఎంతగా పురోగామించినా కొన్ని అనాగరిక పోకడలు ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. పరువు పేరుతో జరుగుతున్న అమానవీయ ఘటనలు నవనాగరిక సమాజం విచక్షణను ప్రశ్నిస్తున్నాయి. కుల, మత, వర్గ, ప్రాంత వైషమ్యాలతో మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పరువు కోసం సొంతవారిని సైతం కడతేర్చేందుకు వెనుదీయని వారు ఉన్నారని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి.

కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో ఓ యువకున్ని కొట్టి చంపిన ఘటన కర్ణాటకలోని రాయచూరుకు సమీపంలో యరమరాస్ లో చోటుచేసుకుంది. ఆనంద్ సాగర్(30) వేరే సామాజిక వర్గానికి చెందిన బసవరాజేశ్వరిని 13 నెలల క్రితం రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మే 17న ఒంటరిగా కనిపించిన ఆనంద్ సాగర్ పై రాజేశ్వరి తండ్రి విరూపాక్షగౌడ్ సహా 8 మంది రాళ్లతో దాడి చేసి కొట్టి చంపేశారు.

పరువు పేరుతో 30 ఏళ్ల వ్యక్తిని, మైనర్ బాలికను సజీవ దహనం చేసిన దారుణ ఘటన బీహార్ లోని గయా జిల్లా ఆమెథ గ్రామంలో ఈనెల 14న జరిగింది. వివాహితుడైన కాసియాదిహ్ గ్రామానికి చెందిన జైరామ్ మాంఝీ, పార్వతీయ కుమారి(14) అనే బాలికతో కలిసి పారిపోయాడు. రెండు రోజుల తర్వాత దొరికిన వీరిని అయినవారే సజీవ దహనం చేశారు.

తెలుగు నేలపైనా పరువు హత్యల పరంపర కొనసాగుతోంది. తమ కూతురు వేరే కులస్తున్ని ప్రేమించిందన్న కారణంతో తల్లిదండ్రులే ఆమెను హతమార్చిన కిరాతక ఘటన చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలం వీరప్పలిలో ఈ ఏడాది ఆరంభంలో జరిగింది. పరువు పోతుందన్న భయంతో కన్నకూతురిని కర్కశంగా చంపారు. ఇలాంటి దారుణ ఘటనలెన్నో గతంలో జరిగాయి. 

దేశంలో ఏదో మూల రోజూ పరువు హత్యలు జరుగుతున్నాయి. పరువు పేరుతో మనుషుల ప్రాణాలు తీయడం అమానుషం. తమ ఇష్టానికి అభీష్టంగా వ్యవహరించారనో,  తమకు తలవంపులు తెచ్చారనో నిండు ప్రాణాలు నిలువునా తీయడం దారుణం. పరువు పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం. ఈ విషయం గుర్తుంచుకుంటే పరువు హత్యలు ఉండవు.

మరిన్ని వార్తలు