నల్లధనం గుట్టు విప్పనున్న లీక్టెన్‌స్టీన్

18 Nov, 2013 04:30 IST|Sakshi

న్యూఢిల్లీ: పన్నులు ఎగవేసి కూడబెట్టిన అక్రమ సంపదను ఇతర దేశాల్లో దాచుకుంటున్న వారి గుట్టుమట్లు తెలుసుకునే కృషిలో భారత్ మరో ముందడుగు వేయనుంది. తమ దేశంలోని బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల సమాచారాన్ని వెల్లడించేందుకు లీక్టెన్‌స్టీన్ దేశం ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో, లీక్టెన్‌స్టీన్ నుంచి ఈ సమాచారం పొందడానికి భారత ప్రభుత్వం దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే కొలిక్కిరానున్నాయి. పన్ను ఎగవేతను అరికట్టడం, నల్లధనం వివరాలను వెల్లడించడంపై అంతర్జాతీయ ఒడంబడికపై సంతకం చేయడానికి లీక్టెన్‌స్టీన్ అంగీకరించిందని ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) వెల్లడించింది. ఈ నెల 21, 22 తేదీల్లో జకార్తా(ఇండోనేసియా)లో జరగనున్న అంతర్జాతీయ సమావేశంలో లీక్‌టెన్‌స్టీన్ ఈ ఒడంబడికపై సంతకం చేయనుంది. పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓఈసీడీ పర్యవేక్షణలో ఈ ఒడంబడిక అమలవుతోంది.

>
మరిన్ని వార్తలు