సెంచరీ వీరుడికి వీరతాళ్లు!

12 Apr, 2017 11:25 IST|Sakshi
సెంచరీ వీరుడికి వీరతాళ్లు!

ఐపీఎల్‌ పదో సీజన్‌లో తొలి సెంచరీతో వీరవిహారం చేసిన యువ బ్యాట్స్‌మన్‌ సంజూ సామ్సన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.  రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు సంజూను సీనియర్‌ క్రికెటర్లు ఘనంగా కొనియాడారు. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి సెంచరీ నమోదు చేసిన బ్రాండన్‌ మెక్కల్లమ్‌ సంజూను ప్రశంసలతో ఆకాశానికెత్తాడు. ’సంజూ క్రికెట్‌ ఆడుతుంటే చూడటం నాకు ఇష్టం. అతనిది అద్భుతమైన ప్రతిభ’ అని మెక్కల్లమ్‌ ట్వీట్‌ చేశాడు.

2008లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడిన మెక్కల్లమ్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలిలా చెలరేగి.. 73 బంతుల్లో 158 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి సెంచరీగా ఈ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ మిగిలిపోయింది. ఇక తాజా పుణె మ్యాచ్‌లో  62 బంతుల్లో శతకం (102) కొట్టిన 22 ఏళ్ల సంజూ  ఐపీఎల్‌లో అతి పిన్నవయస్సులో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2009లో మనీష్‌ పాండే 19 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

వీరోచితమైన ఆటతీరు ప్రదర్శించిన సంజూపై బ్రాండన్‌ మెక్కల్లమ్‌తోపాటు టాప్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ రవిచంద్రన్‌, కామెంటేటర్‌ హర్షభోగ్లే తదితరులు ప్రశంసలతో ముంతెత్తారు. సంజూ గొప్పగా ఆడాడని, అతని ఆడుతుండటం చూసి చాలా ఆనందం కలిగిందని కొనియాడారు.

మరిన్ని వార్తలు