యూపీలో మరో నాయకుడిపై గ్యాంగ్ రేప్ కేసు

5 Mar, 2017 10:51 IST|Sakshi
యూపీలో మరో నాయకుడిపై గ్యాంగ్ రేప్ కేసు

అయోధ్య: గ్యాంగ్ రేప్ కేసులో పరారీలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ మంత్రి గాయత్రి ప్రజాపతి కోసం పోలీసులు గాలిస్తుండగా.. తాజాగా అదే రాష్ట్రంలో బీఎస్పీ నాయకుడిపై ఇలాంటి కేసే నమోదైంది. అయోధ్యలో బీఎస్పీ తరఫున పోటీచేసిన బజ్మీ సిద్ధిఖీ, ఆయన అనుచరులు ఆరుగురు ఓ మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సిద్ధిఖీ, మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా రాజకీయ కుట్రతో తనపై తప్పుడు కేసు పెట్టారని సిద్ధిఖీ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీఎస్పీ గాలి వీస్తోందని, అయోధ్యలో తాను విజయం సాధిస్తానని, ప్రత్యర్థి పార్టీలు తనపై కుట్ర చేశాయని చెప్పారు.

శనివారం రాత్రి సిద్ధిఖీ, ఆయన అనుచరులు ఫైజాబాద్‌లో తన ఇంట్లోకి బలవంతంగా వచ్చి దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను, తన కుటుంబ సభ్యులను చితకబాదారని ఆరోపించింది. మూడు నెలల క్రితం కూడా సిద్ధిఖీ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, స్థానిక పోలీసులు సహకారంతో ఆయన కేసు నుంచి తప్పించుకున్నాడని బాధితురాలు చెప్పింది. ఫైజాబాద్, లక్నోలలో సిద్ధిఖీపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు