ఛత్తీస్‌లో నేడే తుది సమరం

19 Nov, 2013 00:41 IST|Sakshi

 రాయ్‌పూర్‌నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 యూవీ భాస్కర్‌రావు
 
 ఛత్తీస్‌గఢ్‌లో రెండో, చివరి దశ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర అసెంబ్లీలోని 72 స్థానాలకు 18,015 పోలింగ్ బూత్‌ల్లో మంగళవారం ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ కుజుర్ తెలిపారు. 4,594 బూత్‌లను సమస్యాత్మకమైన 1,398 బూత్‌లను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, తదనుగుణంగా అక్కడ భద్రత ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
 
 తొలిదశ ఎన్నికలు జరిగిన మావో ప్రభావిత ప్రాంతాల్లోనే రికార్డ్ స్థాయిలో 75.53 శాతం పోలింగ్ నమోదైన నేపథ్యంలో ఈ విడత పోలింగ్ శాతం పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. మూణ్నెల్ల క్రితం పోలింగ్ శాతం పెంచే లక్ష్యంతో  ప్రారంభించిన ఓటరు అవగాహన కార్యక్రమం(సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) సత్ఫలితాలను ఇచ్చిందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉపప్రధానాధికారిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి అలెక్స్ పాల్ మెనన్ ఈ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనను గతేడాది నక్సలైట్లు అపహరించి 12 రోజులు బందీగా పెట్టుకున్న విషయం గమనార్హం.  తొలిదశలో 18 నియోజకవర్గాలకు నవంబర్ 11న ఎన్నికలు జరిగాయి. తొలి, తుది దశ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.
 
 బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ : ఈ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో పోటీ చేస్తున్న అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంది. 2008లో బీజేపీ నుంచి బయటకు వచ్చిన తారాచంద్ సాహు(ఆ తరువాత చనిపోయారు) స్థాపించిన ఛత్తీస్‌గఢ్ స్వాభిమాన్ మంచ్ కూడా పలు స్థానాల్లో ప్రభావం చూపనుంది. బీఎస్పీ మొత్తం 72 స్థానాల్లోనూ, ఎన్‌సీపీ 12, సీపీఎం, సీపీఐలు చెరో 4 సీట్లలోనూ బరిలో ఉన్నాయి. ఈ ఏడాది మేలో జరిగిన నక్సల్ దాడిలో దాదాపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి నాయకత్వం అంతా చనిపోయిన నేపథ్యంలో.. సానుభూతి ఓట్ల పైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. వివిధ స్థానాల్లో చనిపోయిన నేతల కుటుంబ సభ్యులు, బంధువులనే బరిలో నిలిపింది. అయితే, అంతర్గత విభేదాలు ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయి. అజిత్ జోగి సైతం స్వయంగా ఆ విషయాన్ని ఒప్పుకుంటూ.. అంతర్గత కుమ్ములాటల ఫలితంగా ప్రజల సానుభూతిని ఓట్లుగా మలచుకోలేకపోతున్నామని వాపోయారు. నక్సల్ ప్రభావిత సుక్మా ప్రాంతంలో నక్సల్స్ జరిపిన భారీ దాడిలో పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ సహా 30 మంది చనిపోయారు. మరోవైపు, బీజేపీ ప్రచారం సీఎం రమణ్‌సింగ్ కేంద్రంగా సాగుతోంది.  విద్య, ఉపాధి, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనలో బీజేపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 5 లక్షల మంది తెలుగువారున్నారు. వారిలో అధికశాతం బీజేపీకే మొగ్గు చూపుతున్నారని అక్కడి తెలుగు సంక్షేమ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
 
 ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత ఎన్నికల వివరాలు
 మొత్తం సీట్లు: 90, పోలింగ్ జరగనున్న స్థానాలు: 72
 రిజర్వేషన్: ఎస్టీలకు 17, ఎస్సీలకు 9
 బరిలో ఉన్న మొత్తం అభ్యర్థులు: 843
 వారిలో మహిళలు: 75
 మొత్తం ఓటర్లు: 1,39,75,472
 
బరిలో ప్రముఖులు: స్పీకర్ ధర్మలాల్ కౌషిక్, ప్రతిపక్ష నేత రవీంద్ర చూబే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌సేవక్ పైక్రా, కాంగ్రెస్ మాజీ సీఎం అజిత్‌జోగి భార్య రేణు, మాజీ పీసీసీ చీఫ్ నందకుమార్ పటేల్ కుమారుడు ఉమేశ్ పటేల్, 9 మంది మంత్రులు. పోలింగ్ విధుల్లో: 90 వేల మంది ఉద్యోగులు, లక్షకు పైగా భద్రతా బలగాలు
 

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా