సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలివ్వకుంటే తప్పుకో

17 Jun, 2017 17:28 IST|Sakshi
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలివ్వకుంటే తప్పుకో

- సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్‌:
వారసత్వ ఉద్యోగాలను ఇవ్వలేని టీఆర్‌ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారంలో కొనసాగే అర్హత లేదని సీఎల్పీ ఉపనాయకుడు, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలిస్తామని చెప్పి మూడేళ్లు దాటినా మోసపు మాటలు, చర్యలతో కాలం గడుపుతున్న టీఆర్‌ఎస్‌కు ఇవ్వడం చేతకాకుంటే తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏడు జిల్లాల్లో బంద్ కొనసాగుతున్న విషయాన్ని గుర్తుచేస్తూ వారసత్వ ఉద్యోగాల కోసం గత ఏడాది డిసెంబరులో ఇచ్చిన సర్క్యులర్‌ను సవరించి మళ్లీ జారీ చేయాలని జీవన్‌ రెడ్డి కోరారు. 1981లోనే వారసత్వ ఉద్యోగాలకు ఆమోదం తెలిపారని, 1998లో నిలిపివేశారని వివరించారు. అప్పటినుంచి వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలన్న డిమాండు ఉందన్నారు. వారసత్వ ఉద్యోగాలను పునరుద్దరిస్తామని టీఆర్ఎస్ అనుబంధ సంఘం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాజ్యాంగ పరిధికి లోబడి ఉత్తర్వులు జారీ చేసుకోవాలని హైకోర్టు చెప్పిందని, పాత వాటిని సవరించి మరో సర్క్యులర్‌ను జారీ చేయడానికి అవకాశం ఉందని జీవన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పంతాలకు పోయి కార్మికులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

మరిన్ని వార్తలు