రాహుల్ ప్రచార సారధి మాత్రమే: సోనియా

17 Jan, 2014 11:26 IST|Sakshi
రాహుల్ ప్రచార సారధి మాత్రమే: సోనియా

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీని ప్రకటించే ప్రసక్తే లేదని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో సీడబ్లూసీ నిర్ణయమే ఫైనల్ అని ఆమె మరోసారి  తేల్చిచెప్పారు. అయితే సోనియా ప్రసంగం ముగిసిన అనంతరం రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ నినాదాలు హోరెత్తాయి. పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో పలువురు నేతలు మాట్లాడలేకపోయారు.

2014 ఎన్నికలు సిద్దాంతాల మధ్య పోరుగా సాగుతుందని సోనియా అభిప్రాయపడ్డారు. సంక్షోభాలు ఎదుర్కోవటం కాంగ్రెస్ కు కొత్త కాదని సోనియా అన్నారు. కాగా నిన్న జరిగిన సీడబ్లూసీ భేటీలో రాహుల్‌ ప్రధాని అభ్యర్థిత్వంపై డిమాండ్లు వెల్లువెత్తినా.. పార్టీలో ఆ సంప్రదాయం లేదని పేర్కొన్న సోనియా.. ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారు. పార్టీ ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఈ సూచనపై చర్చించిన సీడబ్లూసీ... రాహుల్‌కు ప్రచార కమిటీ సారధ్య బాధ్యతలు అప్పగించాలని విస్పష్టంగా నిర్ణయించింది.

ఆ క్రమంలో ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఏఐసీసీ భేటీలో  ఆ అంశంపైనే విస్తృతంగా చర్చించనున్నారు. హస్తినలో కొనసాగుతున్న ఏఐసీసీ మీటింగ్‌కు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్రమంత్రులు, సీనియర్ నేతలు, వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

 

మరిన్ని వార్తలు