ఇంకా వేలమంది శిథిలాల కిందే!

28 Oct, 2015 09:22 IST|Sakshi
ఇంకా వేలమంది శిథిలాల కిందే!

తీవ్ర భూకంపంతో వణికిపోయిన ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే మృతుల సంఖ్య 376కి చేరిందని అధికారులు ధ్రువీకరించారు. ఇందులో 258 మంది పాకిస్థాన్లో మరణించగా, ఆఫ్గనిస్థాన్లో 118 మంది వరకు చనిపోయారు. మరోవైపు భూకంపంతో అతలాకుతలమైన చాలా ప్రాంతాలకు సహాయక సిబ్బంది చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నది. భూకంప శిథిలాల కింద చిక్కుకొని ఉన్న వేలమంది బాధితులను రక్షించి సహాయం అందించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఆఫ్గనిస్థాన్ లోని హిందూకుష్ పర్వత్వాల్లో కేంద్రీకృతమై.. 7.5 తీవ్రత నమోదైన భూకంపంతో ఈశాన్య ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్, తజికిస్థాన్, చైనా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారత్ లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

ఫైజాబాద్ కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంపం కేంద్రానికి సమీపంలో బడాక్షన్ ప్రావిన్స్లో ఉన్న గ్రామాలకు చేరేందుకు సహాయక సిబ్బంది ఇప్పటికీ ప్రయత్నిస్తున్నది. కొండలతో కూడిన ఇక్కడ భూకంప తీవ్రవ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. భూప్రకంపనాలతో ఇక్కడి రోడ్లన్నీ ధ్వంసమై.. మారుమూల గ్రామాలకు బయటిప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో గగనతలం ద్వారానే ఇక్కడి భూకంప బాధితులకు సాయం చేసే పరిస్థితి ఇక్కడ నెలకొంది.

 

మరిన్ని వార్తలు