విమానంలో ఓ పైలట్‌ సాహసం!

3 Aug, 2016 16:42 IST|Sakshi
విమానంలో ఓ పైలట్‌ సాహసం!

'నా విమాన సిబ్బందిపై చేయి వేస్తావా? ఎంత ధైర్యం నీకు' అంటూ ఓ పైలట్‌.. తాగిన మత్తులో ఉన్న ప్రయాణికుడికి చుక్కలు చూపించాడు. తాగి విమానంలో ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడికి గట్టిగా బుద్ధి చెప్పాడు. అమెరికాకు చెందిన విమానంలో గత నెల 21న ఈ విరోచిత ఘటన జరిగింది.

కెంటకీలోని లెక్సింగ్టన్‌ నుంచి నార్త్‌ కరోలినాలోని చార్లెట్కు బయలుదేరిన ఈ విమానంలో మైఖేల్‌ కెర్‌ అనే ప్రయాణికుడు మూడు పెగ్గులు విస్కీ తాగి వీరంగం సృష్టించాడు. తనకు కేటాయించిన సీటులో కూర్చోవడానికి నిరాకరించాడు. కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేసిన ఫ్లయిట్‌ ఉద్యోగినితోనూ దురుసుగా ప్రవర్తించాడు. ఆమెను బలవంతంగా కిందకు తోసేసి.. తన సీటు నుంచి ముందుకు ఉరికి వచ్చి.. కూర్చునేది లేదని భీష్మించుకొని నిలబడి రచ్చ చేశాడు. అతనికి  బుద్ధి చెప్పేందుకు పైలట్‌ రంగంలోకి దిగాడు. కూర్చొండి సర్‌ అని మర్యాదగా చెప్పిచూశాడు. అయినా వినిపించుకోకపోవడంతో ఆ ప్రయాణికుడిని బలవంతంగా ఎత్తి కుదేసి.. అతని సీటులో కూర్చోబెట్టాడు పైలట్‌. పైలట్‌ గట్టిగా వార్నింగ్‌ ఇవ్వడంతో మద్యం మైకం దిగిన ఆ ప్రయాణికుడు కిక్కురుమనకుండా కూర్చున్నాడు.

మరిన్ని వార్తలు