గాంధీ మనవడి దీనావస్థ

5 Nov, 2016 12:23 IST|Sakshi
గాంధీ మనవడి దీనావస్థ

ఆస్పత్రిలో చివరిరోజులు గడుపుతున్న కానూ గాంధీ
జాతిపిత వారసుడైనా.. చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి
సొంత గూడు లేక.. ఆశ్రమాల్లో జీవితం వెళ్లదీస్తూ..
ఫోన్లో మోదీ ఓసారి మాట్లాడినా మారని దైన్య స్థితి

 
 సూరత్: ఉప్పు సత్యాగ్రహంలో దండి బీచ్‌లో ఓ పదేళ్ల పిల్లాడు గాంధీజీ చేతికర్ర పట్టుకుని నడిపిస్తున్న చిత్రం దేశ విదేశాల్లోనూ చాలా ప్రత్యేకం. చిత్రంలోని అప్పటి ఆ పిల్లాడి పేరు ‘కానూ రాందాస్ గాంధీ’ (ఇప్పుడు 96 ఏళ్లు). మహాత్ముడి మనవడు. గాంధీకి అత్యంత సన్నిహితులు, దండి సత్యాగ్రహానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉండి బతికున్న అతికొద్ది (వేళ్లమీద లెక్కపెట్టగలిగేవారు) మందిలో కానూ గాంధీ ఒకరు. జాతిపిత మనవడిగా, నాసా శాస్త్రవేత్తగా ఘనమైన చరిత్రే ఉన్నా.. ఇప్పుడు పట్టించుకునేవారెవరూ లేక సూరత్‌లోని ఓ ట్రస్టు ఆస్పత్రిలో దీనావస్థలో చివరి రోజులు గడుపుతున్నారు. భార్య శివలక్ష్మి(90) తప్ప నా అనేవారెవరూ ఆయనకు లేరు.
 
 జాతిపిత మనవడైనా.. మహాత్మాగాంధీ అత్యంత సన్నిహితుల్లో కానూ ఒకరు. చిన్నప్పుడు గాంధీ వ్యక్తిగత అవసరాలను కూడా కానూయే చూసుకునేవారు. స్వాతంత్య్రం వచ్చాక తదనంతర పరిణామాల్లో అప్పటి భారత్‌లో అమెరికా రాయబారి జాన్ కెన్నెత్ సాయంతో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నతవిద్యనభ్యసించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నాసా, అమెరికా రక్షణ శాఖలో ఉద్యోగం చేశారు. ఈ సమయంలోనే మెడికల్ రీసెర్చర్ శివలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. 40 ఏళ్లు అమెరికాలోనే ఉన్న ఈ దంపతులు 2014లోనే భారత్‌కు తిరిగొచ్చారు.
 
 ఇక్కడ సొంత గూడు లేకపోవటంతో.. కొన్ని రోజులు ఆశ్రమాల్లో, సత్రాల్లో గడిపారు. సంపాదించిందంతా దానధర్మాలు చేయడంతో వీరి దగ్గర డబ్బుల్లేని పరిస్థితి నెలకొంది. పదిహేను రోజులుగా సూరత్‌లోని రాధాకృష్ణన్ ఆలయం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి ఉచితంగా సేవలందిస్తూనే.. భార్యాభర్తల బాగోగులు చూసుకునేందుకు ఓ యువకుడిని నియమించింది. కానూ బాల్యమిత్రుడు, మహాత్ముడి అనుచరుడి మనవడైన అయిన ధీమంత్ బధియా (87) ఇటీవలే ఖర్చుల నిమిత్తం తన శక్తికి తగినంత అందజేశారు. అహ్మదాబాద్‌లో ఉండటం, వయసు మీద పడటంతో బాగోగులు మాత్రమే తెలుసుకోగలుగుతున్నారని బధియా ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై, బెంగళూరుల్లో ఉంటున్న కానూ సోదరీమణులూ.. కదిలే పరిస్థితి లేకపోవటంతో ఫోన్లోనే వివరాలు తెలుసుకుంటున్నారు.
 
 ప్రధాని మాటైతే చెప్పారు కానీ..
 ఏడాది క్రితం ఓ కేంద్ర మంత్రి వీరి దీనావస్థ గురించి తెలుసుకుని ప్రధానితో మాట్లాడించారు. సానుకూలంగా స్పందించిన మోదీ.. సాయం చేస్తామని చెప్పినా ఇంతవరకు కేంద్ర, గుజరాత్ మంత్రులెవరూ వీరిని కలవలేదని తెలిసింది. ఆ తర్వాత వీరి గురించి కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదని బధియా తెలిపారు. అక్టోబర్ 22న కానూకు తీవ్రమైన గుండెనొప్పి వల్ల  పక్షవాతం వచ్చి ఎడమవైపు శరీరం పనిచేయటం లేదు.
 
 దీంతో ఆయన మంచానికే పరిమితమయ్యారు. వెంటిలేటర్‌పైనే ఉన్నారు. శివలక్ష్మికి కూడా సరిగా వినిపించదని.. కళ్లు మందగించాయని ఆశ్రమం వైద్యులు తెలిపారు. ‘మహా త్ముడు స్థాపించిన సబర్మతి ఆశ్రమానికి కోట్ల రూపాయల నిధులిస్తున్న ప్రభుత్వం.. జాతిపిత సిద్ధాంతాలకు, వారి కుటుంబ సభ్యులకు కనీస గౌరవం ఇవ్వటం లేదు. చివరి రోజుల్లో ఉన్న కనుపై ప్రభుత్వం ఆరోగ్యపరమైన శ్రద్ధ తీసుకుంటే చాలు. ఇంకేం అవసరం లేదు’ అని బధియా ఆవేదన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు