ఇకపై రెండు ఓట్లుంటే కేసులు

30 Nov, 2015 08:27 IST|Sakshi
ఇకపై రెండు ఓట్లుంటే కేసులు

జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి
* ఒక ఓటును తొలగించుకోవాలని సూచన
* ఓటర్ల జాబితాలో పరిశీలన తప్పనిసరి
* నోటిఫికేషన్ వరకు ఓటర్ల నమోదుకు అవకాశం


సాక్షి, హైదరాబాద్:  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను పురస్కరించుకుని బోగస్ ఓటర్లపై ఎన్నికల యంత్రాంగం కన్నెర్ర చేస్తోంది. గ్రేటర్ పరిధిలో ఒక వ్యక్తికి రెండు ఓట్లు ఉంటే వెంటనే వాటిని తొలగించుకోవాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ప్రకటించారు.

కొందరు ఓటర్లు రెండు సార్లు నమోదు చేసుకోవడాన్ని గుర్తించిన ఎన్నికల యంత్రాంగం చర్యలకు సిద్ధమవుతోంది. మరోవైపు గ్రేటర్ వాసులు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నయా?, లేదా? అన్నది తెలుసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకుంటే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే లోగా నమోదు చేసుకోవాలని సూచించారు.
 
గైర్హాజరైన అధికారులపై చర్యలు: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వార్డుల వారీగా నియామకం అయిన రిటర్నింగ్, అసిస్టెంట్ అధికారుల్లో కొందరు ఇప్పటి వరకు రిపోర్ట్ చేయకపోవడాన్ని కమిషనర్ జనార్దన్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఆదివారం బల్డియా ఎన్నికల నిర్వహణపై అడిషనల్ జోనల్,  డిప్యూటీ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల అధికారులుగా నియామకం అయిన వారిలో ఇప్పటి వరకు కొందరు రిపోర్టు చేయలేదన్నారు. వీరిపై ప్రజా ప్రాతినిధ్య చట్టం అనుసరించి క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్ హెచ్చరించారు. సోమవారం ఉదయంలోగా రిపోర్టు చేయని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని  ఎన్నికల విభాగం అధికారులకు సూచించారు. అదే విధంగా బీసీ ఓటర్ల ముసాయిదా జాబితాపై  క్లెయిమ్‌లు, అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని ఏ రోజుకారోజు  పరిష్కరించాలన్నారు. వార్డుల వారీగా బీసీ ముసాయిదా జాబితాను రాజకీయ పార్టీలకు అందజేశామన్నారు..

>
మరిన్ని వార్తలు