ఘనంగా హైదరాబాద్ విలీన దినోత్సవం

19 Sep, 2015 04:45 IST|Sakshi
ఘనంగా హైదరాబాద్ విలీన దినోత్సవం

* సెప్టెంబర్ 17 తెలంగాణకు చారిత్రక దినోత్సవం: ఉత్తమ్
* ద్వంద్వ వైఖరి అవ లంబిస్తున్న కేసీఆర్: చాడ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు తమ తమ పద్ధతుల్లో నివాళులర్పించాయి. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు భట్టి విక్రమార్క, కె.జానారెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్, పొన్నాల లక్ష్మయ్య, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భారత్‌లో విలీనమైన రోజైనందున తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 అన్నది చారిత్రక దినోత్సవమని అన్నారు. ఇది కొన్ని శక్తులకు వ్యతిరేకమనే భావన సరైంది కాదన్నారు. మఖ్దూంభవన్‌లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాయుధపోరాటాన్ని సీఎం కేసీఆర్ నోటితో పొగుడుతూ, హైదరాబాద్ విమోచనను అధికారికంగా నిర్వహించకుండా నొసటితో వెక్కిరిస్తున్నారని విమర్శించారు.

టీఆర్‌ఎస్ పార్టీగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించి, ప్రభుత్వపరంగా అధికార కార్యక్రమంగా చేయకుండా వ్యతిరేకిస్తూ కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మాట్లాడారు. వచ్చే ఏడాది అయినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. మజ్లిస్‌కు భయపడి ఒక వర్గం ఓట్ల కోసమే దీనిని ప్రభుత్వం నిర్వహించడం లేదన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్‌రాజ్ గంగారాం, ఆహిర్, బీజేఎల్పీ నేత డా.కె.లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.  
 
తెలంగాణ సారథ్య బృందం ఆధ్వర్యంలో
హైదరాబాద్: తెలంగాణ సారథ్య బృందం ఆధ్వర్యంలో గురువారం కోఠిలోని అశోక స్తూపం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు బాబురావువర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ విమోచనం నిజాం వ్యతిరేక పోరాటం వల్లే జరిగిందని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. సీఎం ఇప్పటికైనా విజ్ఞతను ప్రదర్శించి తెలంగాణ విమోచన దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ విమోచనంలో కాంగ్రెస్‌పార్టీ కీలకపాత్ర వహించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, పీసీసీ మాజీ అధ్యక్షులు నర్సారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సుధాకర్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు