మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

6 Mar, 2016 07:03 IST|Sakshi
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

* అచ్చంపేట నగర పంచాయతీకి కూడా...
* ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
* ఖమ్మంలో తొలిసారిగా ఓటుకు రసీదు కోసం వీవీ పాట్ అమలు


సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట నగర పంచాయతీకి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గ్రేటర్ వరంగల్‌లోని 58 డివిజన్లు, ఖమ్మంలోని 50 డివిజన్లు, అచ్చంపేటలోని 20 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

ఈ నెల 8న(బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును ప్రారంభించి అప్పటికప్పుడు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ మూడు పురపాలికల పోలింగ్‌లో పాల్గొనే ఎన్నికల అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలను కట్టబె డుతూ శనివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఖమ్మం కార్పొరేషన్‌లోని 35 డివిజన్ల పరిధిలోని ఒక్కో పోలింగ్ స్టేషన్లో ప్రయోగాత్మకంగా ఓటుకు రసీదు జారీ చేసేందుకు ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీ పాట్) విధానాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో వీవీ పాట్ అమలు చేయడం ఇదే తొలిసారి.
 
వరంగల్‌లో 58 డివిజన్లు.. 398 మంది అభ్యర్థులు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 6,43,862 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో స్త్రీలు 3,20,575 ఉండగా.. పురుషులు 3,23,166, ఇతరులు 121 మంది ఉన్నారు. కార్పొరేషన్‌లో 58 డివిజన్లు ఉండగా 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏకంగా 154 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండటం విశేషం. అధికారులు మొత్తం 660 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్‌కు ఒకటి చొప్పున మొత్తం 660  ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచారు.  మొత్తంగా 3,630 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. మరో 500 మంది ఉద్యోగులను రిజర్వులో ఉంచారు.
 
ఖమ్మం కార్పొరేషన్‌లో బహుముఖ పోరు
ఖమ్మం కార్పొరేషన్‌లోని 50 డివిజన్లలో 291 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఆర్‌ఎస్ నుంచి 50 మంది,  వైఎస్సార్‌సీపీ నుంచి 48, కాంగ్రెస్ నుంచి 42, టీడీపీ నుంచి 48, సీపీఎం నుంచి 40, సీపీఐ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 11మంది, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నుంచి ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థులు 42 మంది పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, టీడీపీలు ఒంటరిగాను, కాంగ్రెస్ సీపీఐలు కలసి పోటీ చేస్తున్నాయి. ఖమ్మం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అవతరించిన తర్వాత తొలి సారిగా జరుగుతున్న ఈ ఎన్నికలను అభ్యర్థులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అధికారులు 50 డివిజన్లలో 265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు