న్యాయదీపం | Sakshi
Sakshi News home page

న్యాయదీపం

Published Sun, Mar 6 2016 2:23 AM

న్యాయదీపం

 ఆడవాళ్లు బలహీనులన్నది ముమ్మాటికీ అవాస్తవం. అందులో కాస్త కూడా నిజం లేదు. ప్రోత్సహిస్తే వాళ్లు పురుషులతో సమానంగా సాధించగలరు. కొన్నిసార్లు పురుషులనూ మించిపోగలరు.
  - ఆనా చాందీ
 
 వందేళ్ల క్రితం అంటే 1900ల మొదట్లో ప్రజా సేవారంగాలు, రాజకీయాలు పూర్తిగా పురుషుల పరమై ఉండేవి. ఆ రోజుల్లో మహిళలను మెట్రిక్యులేషన్ దాటి పై చదువులకు వెళ్లడానికి అనుమతించేవారు కాదు. ఉన్నత చదువులకు వెళ్లాలంటే మగవారితో కలిసి చదవాలి, సన్నిహితంగా మెలగాలి కాబట్టే వారిపై దాదాపుగా నిషేధం అమలయ్యేది. స్త్రీ, పురుషులు కలిసి చదివితే భారత సంస్కృతి ప్రమాదంలో పడుతుందని, మహిళలు పురుషుల దోపిడీకి గురవుతారనే విశ్వాసాలు రాజ్యమేలేవి. పైగా, భారతీయ సంప్రదాయవాదుల్లో ఒక దురభిప్రాయం కూడా ఉండేది. పురుషులతో పోలిస్తే మహిళలు అంత ప్రతిభావంతులు కారట.
 
  మగాళ్లతో పోటీ పడలేరట. సమాజంలో పాతుకుపోయి ఉన్న ఈ దురభిప్రాయాల కారణంగా అసంఖ్యాక మహిళలకు ప్రాథమిక హక్కులు, విద్యావకాశాలను లేకుండా చేశారు.కేరళలోని అనేక సామాజిక బృందాల్లో మాతృస్వామ్యం ఉనికిలో ఉన్నప్పటికీ సమాజం మొత్తంగా మహిళల పట్ల వివక్షను ప్రదర్శించేది. పైగా కేరళలో మాతృస్వామ్యం అతిపెద్ద కపట స్వభావంతో ఉండేదని చాలామంది చెప్పేవారు. పేరుకు మాతృస్వామ్యం అన్నప్పటికీ కుటుంబంలో మాత్రం పురుషుడే పెద్ద దిక్కు.
 
  అయితే మహిళల హక్కుల గుర్తింపు విషయానికి వచ్చేసరికి భారత మహిళల్లోకెల్లా కేరళ మహిళలే సాహసోపేతంగాను, కృతనిశ్చయంతోనూ వ్యవహరించేవారు. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ  రాజకీయాల్లో ప్రవేశించారు. 1919లోనే శ్రీ ములమ్ పాపులర్ అసెంబ్లీలో మహిళలకు ఓటు హక్కు మంజూరు చేశారు. 1922లోనే వీరికి ఓటింగ్, సభ్యత్వ హక్కులు లభించాయి. 1930ల చివరన నారాయణి అమ్మ ట్రావెన్‌కోర్ సంస్థానంలో తొలి శాసన సభ్యురాలిగా చరిత్రకెక్కారు.
 
 ఈ చరిత్ర వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆనా చాందీ దేశంలోనే తొలి తరం ఫెమినిస్టుగా గుర్తింపు పొందారు. కేరళ లోనే కాక, దేశం మొత్తం మీద కూడా లా డిగ్రీ పుచ్చుకున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. తదనంతర కాలంలో దేశంలోనే హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా శిఖర స్థాయిని అందుకున్నారు. ప్రపంచంలోనే  హైకోర్టు న్యాయమూర్తి పదవిని అధిష్ఠించిన రెండో మహిళ ఆమె.
 
 ఆనా కేరళలోని తిరువనంతపురంలో ఒక సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. 1926లో తన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తి చేశారు. 1929 నుంచి లాయర్‌గా ప్రాక్టీసు చేస్తూనే, మహిళల హక్కుల సాధనను, సమాజంలో వారికి ఔచిత్యవంతమైన పాత్రను ప్రోత్సహించే కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వ్యవసాయ భూముల్లో పనిచేసే మహిళలకు సరైన కూలీ ఇచ్చేవారు కారు. ఇతర రంగాల్లో పనిచేసే కార్మిక మహిళలది కూడా ఇదే పరిస్థితి. వీరి సమస్యలను సమాజ దృష్టికి తీసుకురావడానికి, వాటికి పరిష్కార మార్గాలు సూచించేందుకు ఆనా ‘శ్రీమతి’ పేరిట ఒక పత్రిక ప్రారంభించి, దానికి సంపాదకత్వం కూడా వహించారు.
 
 ప్రత్యర్థుల నుంచి, మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకతను, నిరసనలను ఎదుర్కొంటూనే 1931లో శ్రీ ములామ్ పాపులర్ అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. ఆనాడు ట్రావెన్‌కోర్ సంస్థానంలో దివాన్‌గా పనిచేస్తున్న సర్ సీపీ రామస్వామి అయ్యర్ సుప్రసిద్ధ న్యాయవాది. ఈయన ఆనా సామర్థ్యాన్ని, న్యాయ దీక్షాదక్షతను గుర్తించారు. 1937లో ట్రావెన్‌కోర్ మున్సిఫ్‌గా ఆనాను నియమించారు. అలా చాందీ భారతదేశంలో తొలి మహిళా న్యాయమూర్తి అయ్యారు.
 
 స్వాతంత్య్రానంతరం 1948లో చాందీ జిల్లా న్యాయమూర్తి అయ్యారు. పదవీకాలంలో ఆమె వెలువరించిన తీర్పులు కొన్ని చరిత్రాత్మకమైనవిగా గుర్తింపు పొందాయి. భారత న్యాయసూత్రాలపై, వాటిని సరైనరీతిలో అన్వయించడంపై ఆమెకు ఉన్న పట్టును విమర్శకులు సైతం కొనియాడారు. ఆమె ద్వారా భారతీయ న్యాయ విభాగంలో మహిళల ప్రవేశానికి అవకాశాలు తెరుచుకున్నాయి.
 
 నాటి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీకే బాలి మాటల్లో చెప్పాలంటే న్యాయవ్యవస్థలో అంతవరకు ఉన్న లింగ వివక్ష స్థానంలో లింగ తటస్థతకు దారి తీసిన ఘటనకు ఆనా సాక్షిగా నిలిచారు. 1967 ఏప్రిల్ 5 వరకు ఆమె కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. పదవీ విరమణ తర్వాత భారతీయ లా కమిషన్ సభ్యురాలిగా వ్యవహరిచారు. 1996 జూలై 20న 91 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
 
 భారతీయ మహిళల హక్కులకోసం నినదించిన తొలి తరం నేతల్లో ఆనా ఒకరు. భారత మహిళల, ప్రత్యేకించి కేరళ మహిళల అభ్యున్నతి కోసం ఆమె ఎనలేని ప్రయత్నాలు చేశారు. మహిళా సాధికారత కేవలం మాటల్లో మాత్రమే కనబడుతున్న నాటి కాలంలో స్వయంకృషితో, అంకితభావంతో ఆమె ఉన్నతస్థాయికి ఎదిగారు. దుర్భేద్యంగా కనిపిస్తున్న సమాజ బంధనాలను తెంచుకుని స్వయం ప్రతిభతో వికసించిన ఆనా చాందీ భారత మహిళా సాధికారత తొలి గీటురాళ్లలో ఒకరు!
 - కె.రాజశేఖరరాజు
 

Advertisement
Advertisement