హైస్కూల్ నుంచే ఉద్యోగుల నియామకం!

24 Mar, 2017 12:56 IST|Sakshi
హైస్కూల్ నుంచే ఉద్యోగుల నియామకం!
హైస్కూలు చదువుతూనే బుడతలు టెక్నాలజీలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలను తీసుకొస్తూ కంపెనీలను ఆశ్చర్యపరుస్తున్నారు. టెక్నాలజీలో అద్భుతమైన ఆవిష్కరణలు సృష్టిస్తుండటంతో, దేశంలో నాలుగో అతిపెద్ద హెచ్సీఎల్ టెక్నాలజీ డైరెక్ట్ గా హైస్కూలు పిల్లల్నే రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించింది. వారిని సంస్థలోకి నియమించుకుని, ట్రైనింగ్ ఇచ్చి, ఐటీ నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. ఈ రిక్రూట్ మెంట్లో భాగంగా సైన్సు నేపథ్యమున్న 12వ క్లాస్ వారిని వార్షిక వేతనం రూ.1.8 లక్షలు ఆఫర్ చేస్తూ వీరిని తీసుకుంటోంది. టెక్ట్స్ యాప్స్ ను అభివృద్ధి చేయడానికి వీరి సేవలను వినియోగించుకుంటోంది.
 
ఈ టెక్నాలజీ దిగ్గజం ఇటీవలే  ఓ పైలెట్ ప్రొగ్రామ్ ను కూడా మధురైలో ప్రారంభించింది. ఈ ప్రొగ్రామ్ లో భాగంగా 100 మంది 12వ తరగతి విద్యార్థులను నియమించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. వీరికి తమ కోయంబత్తూరులోని క్యాంపస్ లో ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత సంస్థలోకి తీసుకోనున్నట్టు తెలిపింది. అయితే బోర్డు ఎగ్జామ్స్ లో 85 శాతం కంటే పైగా స్కోర్ వచ్చిన వారికే ఈ అవకాశం దక్కుతుందట. అంతేకాక సహకార వెంచర్ ఏర్పాటు చేసి, ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీ ద్వారా బీఎస్ఈ డిగ్రీ పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. ఎక్కువ అవకాశాలు చేతిలో లేని వారికి ఈ ట్రైనింగ్ ఎంతో సహకరిస్తుందని ఇండస్ట్రి నిపుణులంటున్నారు. రెగ్యులర్ కోర్సులు చేయలేని విద్యార్థులకు ఇది మంచి అవకాశమని హెచ్సీఎల్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు. 
మరిన్ని వార్తలు