'జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు'

15 Feb, 2014 18:45 IST|Sakshi
'జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు'

తాను పశ్చిమబెంగాల్లోనే ఉంటాను తప్ప జాతీయ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఫైర్ బ్రాండ్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వ్యాఖ్యలను రాజకీయ డ్రామాగా ఆమె కొట్టిపారేశారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడితే బెంగాల్ అభివృద్ధికి ఆమె కంటున్న కలలు నిజమవుతాయని మోడీ చెప్పిన విషయం తెలిసిందే. కాషాయ పార్టీలా తాను ఎన్నికల సమయంలో డ్రామాలు ఆడలేనని ఆమె మండిపడ్డారు.

తాము 365 రోజులూ సామాన్యులను కలుస్తూనే ఉంటామని, వారి సమస్యల గురించి తెలుసుకుంటామని ఆమె చెప్పారు. బీజేపీలా కాకుండా తమ పార్టీ ఎప్పుడూ ప్రజలకు సన్నిహితంగానే ఉంటుందని మమత అన్నారు. రాబోయే రోజుల్లో భారతదేశానికి బెంగాల్ మార్గదర్శకత్వం వహిస్తుందని చెప్పారు. మమతను దేశ ప్రధానిగా చూడాలని ఉందని ఇటీవల ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి, ముస్లిం మతగురువు మౌలానా బర్కాతీ తదితరులు కోరిన నేపథ్యంలో.. తాను బెంగాల్లోనే ఉంటానని, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 42 లోక్సభ స్థానాలూ తమకే దక్కేలా చూసుకోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు