వడ్డీరేట్లలో కోత పెట్టనున్న ఇతర బ్యాంకులు

3 Nov, 2016 13:33 IST|Sakshi
వడ్డీరేట్లలో కోత పెట్టనున్న ఇతర బ్యాంకులు

ముంబై: ప్రభుత్వం రంగ  బ్యాంకింగ్ దిగ్గజం  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ వడ్డీరేట్లపై కోత పెట్టిన అనంతరం అదే బాటలో  మరిన్ని బ్యాంకులు పయనించనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రయివేటు బ్యాంక్ దిగ్గజం, ఐసీఐసీఐ సహా, హెచ్డీఎఫ్ఎసీ లాంటి  ఇతర బ్యాంకులు తమ వార్షిక ఎంసీఎల్ ఆర్ ను  మరో 20  బేసిస్  పాయింట్లను  తగ్గించి,  9.3 శాతంగా ఉంచనున్నాయని పేర్కొంటున్నారు.   దీనిపై ఈరోజు ఒక ప్రకటన  వచ్చే అవకాశం ఉందని  వెల్లడించారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వడ్డీ రేట్ల  తగ్గింపు విషయంలో ఎస్ బీఐని అనుసరించనున్నారని  అంచనా  వేస్తున్నారు.   ప్రధానంగా పండుగల సీజన్ నేపథ్యంలో  తమ రీటైల్ లోన్ బుక్ వృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నారంటున్నారు.
మార్కెట్ లో  పోటీని తట్టుకునేందుకు  రుణవడ్డీ రేట్ల కుదింపు తప్పదని  ప్రయివేట్ బ్యాంక్ సీనియర్ ప్రతినిధి పేర్కొన్నారు.  అలాగే ఇక్రా రేటింగ్ ఏజెన్సీ  సీనియర్ ప్రతినిధి కార్తిక శ్రీనివాసన్ అంచనా ప్రకారం ఆయా బ్యాంకులు మరో 15-20  బేసిస్ పాయింట్ల  కోత పెట్టనున్నాయి.  పెద్ద కార్పొరేట్ల నుంచి క్షీణిస్తున్న డిమాండ్ దృష్ట్యా బ్యాంకులు రీటైల్ రుణాల వైపు దృష్టి పెట్టనున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు.  ముఖ్యంగా   గృహరుణాల వృద్ధిపై శ్రద్ధ పెట్టనున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం  2015  ఆగస్టులో రూ. 6,74,500 కోట్ల రుణాలతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టు నాటికి 16.7 శాతం  పెరిగి రూ. 7,86,900కోట్లుగా నమోదైంది.   కాగా  రిజర్వు బ్యాంకు గత నెల పాలసీ రివ్యూలో  కీలక వడ్డీ రేట్లను  0.25 శాతం  తగ్గించింది. అలాగే ఈమేరకు  దేశీయ బ్యాంకులు వడ్డీరేట్లలో  కోత పెట్టాలని సూచించిన సంగతి  తెలిసిందే.  

 

>
మరిన్ని వార్తలు