విడిపోవాలి.. లేదు కలిసుండాలి!

18 Sep, 2014 13:02 IST|Sakshi
విడిపోవాలి.. లేదు కలిసుండాలి!

విభజించు పాలించు విధానాన్ని అవలంభించిన ఆంగ్లేయులు ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. తమతో సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించిన స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భావించాలన్న ఆకాంక్షను వెల్లడించడంతో విలవిల్లాడుతున్నారు. విడిపోవద్దంటూ స్కాట్లాండ్ వాసులను వేడుకుంటున్నారు. మరోవైపు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు స్కాట్లాండ్ ప్రజలు సిద్దమయ్యారు. ఫలితం ఎలావున్నా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విభజనపై స్కాట్లాండ్ లోని ప్రవాస భారతీయులు రెండుగా విడిపోయారు. కొంతమంది సమైక్యానికే మద్దతు పలుకుతుంటే, మరికొందరు విడపోవడమే మేలంటున్నారు. స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలన్న ఆకాంక్షను భారత సంతతి విద్యార్థిని జవిత నారంగ్ వ్యక్తం చేసింది. స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి కావలసిన  అన్ని అర్హతలు స్కాట్లాండ్ కు ఉన్నాయని ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో క్లినికల్ సైకాలజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న జవిత అభిప్రాయపడింది. జవిత అభిప్రాయంతో అబర్డీన్ ఇండియన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు మొహువా బెనర్జీ విభేదించారు. బ్రిటన్ లో భాగంగా స్కాట్లాండ్ కొనసాగాలని తాను కోరుకుంటున్నానని మూడు దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న ఆమె పేర్కొన్నారు. ఏ దేశమైనా విడిపోతే బలహీనపడుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

మొహువా వాదనతో గ్లాస్కో బెంగాలీ సాంస్కృతిక సంఘం అధ్యక్షురాలు షీలా బెనర్జీ ఏకీభవించారు. గ్లాస్కో ప్రాంతంలో ఉన్న బెంగాలీల్లో 99 శాతం మంది విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. బ్రిటన్ నుంచి స్కాట్లాండ్ విడిపోరాదని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని బ్రిటన్ కు చెందిన సోషల్ వర్కర్ రిచా గ్రోవర్ కోరారు. బ్రిటన్‌తో 307 ఏళ్ల అనుబంధాన్ని కొనసాగించడమా? లేక స్వతంత్ర దేశంగా తొలి అడుగులు వేయడమా? అనేది స్కాట్లాండ్ ప్రజలు మరికొద్ది గంటల్లో నిర్ణయించనున్నారు.

మరిన్ని వార్తలు