సూరత్‌లో అణుబాంబు పేల్చాలనుకున్నా!

31 Dec, 2013 13:14 IST|Sakshi
సూరత్‌లో అణుబాంబు పేల్చాలనుకున్నా!

న్యూఢిల్లీ: అణుబాంబు.. అత్యంత ఆధునిక ఆయుధం.. భారీస్థాయిలో ప్రాణనష్టాన్నే కాకుండా, తరాల తరబడి తీవ్ర ప్రభావం చూపగల మారణాయుధం. అది ముష్కరులు.. ముఖ్యంగా భారత్‌పై ఎల్లవేళలా విషం కక్కే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) లాంటి ఉగ్రవాద సంస్థల చేతికి చిక్కితే.. వారికి అవి యథేచ్ఛగా లభిస్తుంటే..! ఐఈడీ లాంటి బాంబులతోనే అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులు.. ఇక అణుబాంబు దాడులను ప్రారంభిస్తే..! ఆలోచిస్తేనే వణుకు పుట్టే పరిస్థితి.

అయితే, అణు బాంబులు అంత ఈజీగా ఉగ్రవాదులకు లభించవని, వాటిని భద్రపరిచే, వినియోగించే సాంకేతికత వారి దగ్గర లేదనే నమ్మకంతో మనమే కాదు, మన నిఘా సంస్థలూ ఉన్నాయి. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా పలు కళ్లు చెదిరే వాస్తవాలను ఇండియన్ ముజాహిదీన్ ఇండియా చీఫ్ యాసిన్ భత్కల్ వెల్లడిస్తున్నాడు. ప్రస్తుతం జాతీయ నిఘా సంస్థ(నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) అదుపులో ఉన్న యాసిన్ ఐఎం ప్రణాళికలను, శిక్షణ విధానాలను, సహాయం అందిస్తున్న వారి వివరాలను ఇంటరాగేషన్ సందర్భంగా వెల్లడిస్తున్నాడు. ఒక ఆంగ్ల పత్రిక చేతికి యాసిన్ భత్కల్ ఇంటరాగేషన్ వివరాలు చిక్కాయి.

అవి యాసిన్ భత్కల్ మాటల్లోనే.. ‘గుజరాత్‌లోని సూరత్‌లో చిన్నపాటి అణుబాంబును పేల్చాలని ప్రణాళిక వేశాను. న్యూక్లియర్ బాంబును అందించగలరా? అని పాకిస్థాన్‌లోని మా బాస్ రియాజ్ భత్కల్‌ను అడిగాను. పాకిస్థాన్‌లో మనకు ఏదైనా లభిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. నాకో చిన్నపాటి అణుబాంబును అందించమని, దానిని సూరత్‌లో పేల్చాలనుకుంటున్నానని చెప్పాను. అలా చేస్తే ముస్లింలు కూడా చనిపోతారని రియాజ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అలా జరగకుండా.. కుటుంబాలతో సహా నగరం విడిచివెళ్లిపోవాలని కోరుతూ పేలుడుకు ముందు సూరత్‌లోని అన్ని మసీదుల్లో పోస్టర్లు అతికిస్తానని చెప్పాను’.
 
అదృష్టవశాత్తూ ఆ ప్రణాళిక కార్యరూపం దాల్చకముందే యాసిన్ భత్కల్ నేపాల్‌లో ఈ ఆగస్ట్‌లో అరెస్ట్ అయ్యాడు. కానీ అణుబాంబు భయం మాత్రం మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. విచారణ సందర్భంగా యాసిన్ ఐఎం నిర్వహణకు సంబంధించిన పలు వివరాలను భారత నిఘా విభాగాలకు వెల్లడిస్తున్నాడు. సైనిక శిక్షణకు దీటైన శిక్షణను పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ సహకారంతో పాకిస్థాన్‌లో ఐఎం శ్రేణులకు అందుతోందని తెలిపాడు. అందులో శారీరక ధృడత్వ శిక్షణ, పీఈ3ఏ, సీ3, సీ4, టీఎన్‌టీ సహా పలు రకాల బాంబుల తయారీ, పిస్టల్ నుంచి ఏకే 47 వరకు అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించే విధానం నేర్పిస్తారని చెప్పాడు. సాధారణంగా 50 రోజులపాటు ఆ శిక్షణ ఉంటుందన్నారు. దాడులకు సంబంధించిన అన్ని ప్రణాళికలను రియాజ్ భత్కల్‌కు తెలియజేస్తామన్నాడు.

మరిన్ని వార్తలు