షీనా బోరా హత్యకేసులో మరో మలుపు

17 Jan, 2017 14:12 IST|Sakshi
షీనా బోరా హత్యకేసులో మరో మలుపు
షీనాబోరా (24) హత్య జరిగిన ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, సవతి తండ్రి పీటర్ ముఖర్జియాలపై హత్య, నేరపూరిత కుట్ర ఆరోపణలు మోపారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలైంది. వీటిపై సీబీఐ ప్రత్యేక కోర్టులో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విచారణ మొదలవుతుంది. ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా మీద షీనా సోదరుడు మిఖాయిల్ బోరా మీద హత్యాయత్నం చేసిన నేరం మోపారు. తన సోదరి అదృశ్యం కావడం గురించి పదే పదే ప్రశ్నలు అడగడం వల్లే అతడిని చంపాలని ఇంద్రాణి భావించినట్లు సీబీఐ తెలిపింది. 
 
ఈ కేసులో నాలుగో నిందితుడైన శ్యామ్‌వర్ రాయ్ కూడా హత్యకు సహకరించినా, ఆ తర్వాత అతడు సీబీఐకి అప్రూవర్‌గా మారిపోయాడు. ఆస్తి వివాదంలోనే షీనాబోరాను ఇంద్రాణి హతమార్చిందని సీబీఐ ఆరోపించింది. ఈ హత్య ప్లాన్ మొత్తం పీటర్‌కు బాగా తెలుసని చెప్పింది. 2012 ఏప్రిల్ నెలలో షీనాను కారులో ముంబై శివార్లకు తీసుకెళ్లిన ఇంద్రాణి.. తన మాజీ భర్త, డ్రైవర్ల సహాయంతో ఆమెను పీకపిసికి చంపేసిందని ఆరోపణలున్నాయి. సగం కాలిన స్థితిలో ఉన్న షీనాబోరా మృతదేహం 2015 సంవత్సరంలో ముంబై సమీపంలోని అడవుల్లో దొరికింది. అదే సంవత్సరం ఆగస్టులో ఇంద్రాణిని అరెస్టుచేశారు.