టీవీ చానళ్లలో ఆ ప్రసారాలే ప్రాణం తీశాయా?

1 May, 2017 16:21 IST|Sakshi
టీవీ చానళ్లలో ఆ ప్రసారాలే ప్రాణం తీశాయా?

- ప్రఖ్యాత మీడియా గ్రూప్‌ అధినేత కరీమియాన్‌ దారుణ హత్య
- టీవీ ప్రసారాలపై మత సంస్థల హెచ్చరికలు..
- కుట్రపై కుటుంబీకుల అనుమానం.. డబ్బుల కోసమేనన్న పోలీసులు


ఇస్తాంబుల్‌:
ప్రఖ్యాత జెమ్‌ మీడియా గ్రూప్‌ అధినేత సయీద్‌ కరీమియాన్‌(45) దారుణ హత్యకు గురయ్యారు. వ్యాపార భాగస్వామితో కలిసి కారులో ప్రయాణిస్తున్న ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు వెంటాడిమరీ హతమార్చారు. ఇస్తాంబుల్‌ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన టర్కీ, ఇరాన్‌లను ఉలిక్కిపడేలా చేశాయి. దీనికి సంబంధించిన వివరాలను టర్కీ పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు.

కారులో ప్రయాణిస్తున్న కరీమియాన్‌ను.. వేరొక వాహనంలో దుండగులు వెంబడించారని, మస్లాక్‌ కూడలిలో జీపును అడ్డంగా నిలిపి కరీమియాన్‌పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని పోలీసులు చెప్పారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కరీమియాన్‌ అక్కడికక్కడే మరణించగా, కారులో ఉన్న అతని కువైతీ భాగస్వామి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయాడని వివరించారు. ఆర్థిక వివాదాల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

జెన్‌ టీవీ.. ఇరాన్‌లో ఓ సంచలనం: లండన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే జెన్‌ టీవీ ఇరాన్‌లో సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు! దశలవారిగా పారశీ భాషలో 17 చానెళ్లు, కుర్దూ, అరబిక్‌, అజెరీ భాషల్లో ఒక్కో టీవీ చానెళ్లు ప్రారంభించిన కరీమియాన్‌.. వాటిలో ఎక్కువగా పాశ్చత్య కార్యక్రమాలనే ప్రసారం చేసేవారు. విదేశీయుల ఫ్యాషన్‌ షోలు, పార్టీ కల్చర్స్‌, సినిమా సంబంధిత వార్తలను పార్శీలోకి తర్జుమా చేసి ప్రసారం చేసేవారు. షరియత్‌ చట్టాలు కఠినంగా అమలయ్యే ఇరాన్‌లో ఈ తరహా ప్రసారాలపై స్థానిక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. టీవీ ప్రసారాల ద్వారా ప్రజల్ని చెడగొడుతున్నాడనే నేరం కింద జెన్‌ టీవీ అధినేత కరీమియాన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ టెహ్రాన్‌ కోర్టు సంచలన తీర్పు చెప్పింది.

హత్యకు వినియోగించిన వాహనం దహనం: కొంత కాలంగా ఇస్తాంబుల్‌లో ఉంటోన్న కరీమియాన్‌ను పలు మత సంస్థలు తీవ్రంగా హెచ్చరించాయని, దీంతో ఆయన మకాంను లండన్‌కు మార్చాలనుకున్నారని, ఇంతలోనే దారుణం జరిగిపోయిందని కరీమియాన్‌ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇకపోతే, కరీమియాన్‌ను హత్య చేసే క్రమంలో దుండగులు వినియోగించిన వాహనం.. దహనమైన స్థితిలో గుర్తించినట్లు టర్కీ పోలీసులు చెప్పారు. ఆనవాళ్లు చిక్కూడదనే హంతకులు ఇలా చేసిఉంటారన్న పోలీసులు.. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు