రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణ అభివృద్ధి

9 Sep, 2015 02:03 IST|Sakshi
రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణ అభివృద్ధి

- ఇది సర్కారుకు సిగ్గుచేటు
- సీపీఎం కార్యదర్శి తమ్మినేని
సాక్షి, హైదరాబాద్ :
రైతుల ఆత్మహత్యల్లోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది తప్ప మరేమీ లేదని, ప్రస్తుత పాలకవర్గానికి ఇది సిగ్గుచేటని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు.  మంగళవారం ఎంబీభవన్‌లో పార్టీనాయకులు డీజీ నరసింహారావు, ఎం.శ్రీనివాస్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంపద పెరుగుతుందని, అందరి బతుకులు బాగుపడతాయని భావిస్తే ఆత్మహత్యల్లో అభివృద్ధి ఉంటోందని ఎద్దేవా చేశారు. ఈ నెల 23న అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేలోగా రైతాంగ సమస్యలతోపాటు పట్టణప్రాంతాల్లోని ప్రజల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

బీసీ సబ్‌ప్లాన్, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు నిబంధనలు రూపొందించి, మైనారిటీలకు సబ్‌ప్లాన్, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు.  ఆత్మహత్యల పరంపర సాగుతుంటే పాలకపక్షంలో అసలు స్పందనే లేదని, వాస్తవానికి 1300 మందిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. వీటన్నింటిపై ప్రభుత్వపరంగా స్పందన లేకపోతే అసెంబ్లీలో, బయట  కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు.  కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీల విషయంలో తెలంగాణ పట్ల వివక్షను ప్రదర్శిస్తోందన్నారు. స్మార్ట్‌సిటీల పథకం గతంలో జేఎన్‌యూఆర్‌ఎంకు కొనసాగింపేనని ఎం.శ్రీనివాస్ తెలిపారు.
 
రేపు వరంగల్ వామపక్ష అభ్యర్థి ప్రకటన
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగే బహిరంగసభలో వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీచేసే వామపక్షాల అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఉప ఎన్నికల్లో పోటీ విషయంలో ప్రజాగాయకుడు గద్దర్ సానుకూలంగానే ఉన్నా ఇది ఇంకా ఖరారు కాలేదన్నారు. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థి విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని మంగళవారం ఆయన మీడియాకు చెప్పారు. కిష్టారెడ్డి మృతి కార ణంగా మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లోనూ వామపక్షాల తరఫున అభ్యర్థిని నిలపనున్నట్లు చెప్పారు.

>
మరిన్ని వార్తలు