జెట్ డీల్‌లో మార్పులు

27 Jul, 2013 06:44 IST|Sakshi
జెట్ డీల్‌లో మార్పులు
   ఇద్దరు డెరైక్టర్లకు ఎతిహాద్ ఓకే
నియంత్రణ కూడా భారత ప్రమోటర్లకే
సవరణలతో కొత్త ప్రతిపాదన
వచ్చే వారం కేంద్రం నిర్ణయం
17 శాతం దూసుకెళ్లిన షేరు
 
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల కొనుగోలుకు సంబంధించి ఎఫ్‌ఐపీబీ అనుమతి పొందేందుకు అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌లైన్స్ తన ప్రతిపాదనకు కొన్ని సవరణలు చేసింది. జెట్ ఎయిర్‌వేస్‌లో తమ డెరైక్టర్ల సంఖ్యను ముందుగా ప్రతిపాదించినట్లు మూడు కాకుండా రెండుకు పరిమితం చేసేందుకు అంగీకరించింది. 
 
అలాగే, నియంత్రణ అధికారాలను భారత ప్రమోటర్ల చేతిలోనే ఉంచడానికి అంగీకరించింది. షేర్‌హోల్డింగ్ ఒప్పందం (ఎస్‌హెచ్‌ఏ) వివరాలతో పాటు సవరించిన  ప్రతిపాదనను ఆర్థిక శాఖకు సమర్పించింది. ఈ నెల 29న నిర్ణయం తీసుకునే దిశగా ఆర్థిక శాఖ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) దీన్ని వారాంతంలో పరిశీలించనున్నాయి. సవరించిన షేర్‌హోల్డింగ్ ఒప్పందం ప్రకారం డీల్ పూర్తయిన తర్వాత కంపెనీ బోర్డులో ఎతిహాద్ నుంచి ఇద్దరు డెరైక్టర్లు ఉంటారు. 
 
అలాగే, కీలక నిర్ణయాల విషయంలో మెజారిటీ షేర్‌హోల్డరైన నరేష్ గోయల్‌తో ఎతిహాద్ కుమ్మక్కు కాబోదు. షేర్ హోల్డింగ్ విధానం మాత్రం గతంలో ప్రతిపాదించినట్లుగా ఎతిహాద్‌కి 24%, ప్రధాన ప్రమోటర్ నరేష్ గోయల్‌కి 51% మిగతా 25% వాటా సంస్థాగత ఇన్వెస్టర్లు మొదలైన వారి దగ్గర ఉంటాయి. సుమారు రూ. 2,058 కోట్లతో జెట్ ఎయిర్‌వేస్‌లో ఎతిహాద్ 24% వాటాలు కొనేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. 
గతంలో సమర్పించిన ప్రతిపాదన ప్రకారమైతే... జెట్ ఎయిర్‌వేస్ నలుగురు డెరైక్టర్లను, ఎతిహాద్ ముగ్గురు డెరైక్టర్లను నామినేట్ చేయాలి. 
 
మరో ఏడుగురు స్వతంత్ర డెరైక్టర్లలో కనీసం ఆరుగురు భారతీయులై ఉంటారు. ఈ డీల్‌లో ఎఫ్‌డీఐ అంశం ముడిపడటంతో కంపెనీ యాజమాన్య అధికారాల విషయంలో ఎఫ్‌ఐపీబీ, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.  కాగా, ఏవియేషన్ రంగంలో 49% ఎఫ్‌డీఐలకే ఆమోదం ఉంది. కానీ గోయల్ ఎన్నారై కావటంతో ఆయన వాటా, ఎతిహాద్ వాటా కలిపి ఆ పరిమితిని మించుతున్నాయనేది ఎఫ్‌ఐపీబీ, సెబీల అభ్యంతరం. కానీ ఈ డీల్‌కోసం గట్టిగా పట్టుబడుతున్న సదరు శాఖ మంత్రి ఆనంద్‌శర్మ ఈ నిబంధనల్ని సవరించే ప్రయత్నాలూ చేస్తున్నారు. జెట్-ఎతిహాద్ డీల్‌కి గ్రీన్ సిగ్నల్ రావచ్చనే అంచనాలతో శుక్రవారం జెట్ షేరు బీఎస్‌ఈలో 17% ఎగసి రూ.395.50 వద్ద ముగిసింది.
 
మరిన్ని వార్తలు