జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణకు మరో 100 కోట్లు

30 Sep, 2023 04:50 IST|Sakshi

ఇన్వెస్ట్‌ చేసిన జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా జలాన్‌ కల్రాక్‌ కన్సార్షియం (జేకేసీ) మరో రూ. 100 కోట్లు సమకూర్చింది. దీనితో, కోర్టు ఆమోదిత పరిష్కార ప్రణాళిక ప్రకారం మొత్తం రూ. 350 కోట్లు సమకూర్చినట్లయిందని జేకేసీ తెలిపింది. కంపెనీపై పూర్తి అధికారాలు దక్కించుకునేందుకు అవసరమైన నిబంధనలన్నింటినీ పాటించినట్లయిందని పేర్కొంది.

ఎయిర్‌లైన్‌ కార్యకలాపాల పునరుద్ధరణ ప్రణాళికలో ఎటువంటి మార్పులు ఉండవని, వచ్చే ఏడాది (2024) నుంచి ప్రారంభించేందుకు కొత్త ప్రమోటర్లు దృఢనిశ్చయంతో ఉన్నట్లు జేకేసీ వివరించింది. లాంచ్‌ తేదీని రాబోయే వారాల్లో ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు 2019 ఏప్రిల్‌ 17 నుంచి నిల్చిపోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు