శాశ్వత నిద్రలోకి ‘కళ్లు’

20 Oct, 2015 12:57 IST|Sakshi
శాశ్వత నిద్రలోకి ‘కళ్లు’

విశాఖ-కల్చరల్: ఉత్తరాంధ్ర మాండలికంలో ‘‘ఓలమ్మోలమ్మో నేనేటి సేసేది’’ లాంటి డైలాగులతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన కళ్లు చిదంబరం (70) ఇకలేరు.  కొద్దికాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విజయనగరంలో 1945 అక్టోబర్ 10న జన్మించిన కొల్లూరు చిదంబరం విశాఖ పోర్టులో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. 36వ ఏట ఒక కన్ను మెల్లకన్నుగా మారడంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తికాలం నాటక, సినిమా రంగాలకు అంకితమయ్యారు. 1989లో ఎం.వి.రఘు దర్శకత్వంలో వచ్చిన కళ్లు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. అందులో అంధుని పాత్రలో మెప్పించారు.
 
 దీంతో ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. చిదంబరం 300 చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువ హాస్యపాత్రలే.  కళ్లు, అమ్మోరు చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. జంబలకిడిపంబ, ఆ ఒక్కటీ అడక్కు, ఏప్రిల్ ఒకటి విడుదల, మనీ, గోవింద గోవింద, పెళ్లిచేసుకుందాం, ఒట్టేసి చెబుతున్నా, సీతయ్య, మృగరాజు, శ్వేతనాగు, కొండవీటి దొంగ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. చిదంబరం మృతితో తెలుగు చిత్రసీమ మరో మంచి హాస్యనటుడిని కోల్పోయిందని సహనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఆరో తరగతి నుంచే..
 విజయనగరం మున్సిపల్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతుండగానే ‘కోయదొర’ అనే విచిత్ర వేషధారణ వేశారు. ఆ తర్వాత 1962 సంవత్సరం ‘బ్రహ్మచారులు’ నాటిక ద్వారా రంగస్థల ప్రవేశం చేసి 36 నాటికలు, నాటకాల్లో నటించారు.నాటకరంగంపై మక్కువతో దాదాపు 14 ఏళ్లపాటు సాంస్కృతిక కార్యకలాపాల్లో అవిశ్రాంతంగా పాల్గొన్నారు. దీనివల్ల ఒక కంటి నరం దెబ్బతినడంతో 36 ఏళ్ల వరకూ సవ్యంగానే ఉన్న ఆ కన్ను పూర్తి మెల్లకన్నుగా మారిపోయింది. అలా అయినా బాధపడకుండా యథాతథంగా నాటకాలు వేశారు. వాణి ఆర్ట్స్ అసోసియేషన్ పేరుతో నాటికలు, నాటకాల పోటీల్లో పాల్గొన్నారు.
 
 వెండితెరపై మెరిసిన ఆ ‘కళ్లు’
 ఎటువైపు చూస్తున్నాడో తెలియని తన మెల్లకన్నుతోనే వెండితెరపై చిదంబరం హాస్యగుళికలు చల్లారు. గొల్లపూడి మారుతీరావు రచించిన ‘కళ్లు’ నాటకాన్ని తెరకెక్కించడానికి దర్శకుడు రఘు ప్రయత్నిస్తున్న సందర్భంలో.. ఆ సినిమాలో నటించాలని చిదంబరాన్ని ప్రముఖ దర్శకుడు ఎల్.సత్యానంద్ కోరారు. దీనికి చిదంబరం అంగీకారం తెలిపారు. కళ్లు సినిమా స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకోవడంతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకుంది. చిదంబరానికి నంది పురస్కారం, కళాసాగర (మద్రాస్) పురస్కారం లభించాయి. అప్పటి నుంచి చిదంబరం జీవితం మలుపు తిరిగింది. ఏప్రిల్ ఒకటి విడుదల సినిమాలో పాత టీవీలు అమ్మేవాడి పాత్ర, ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో అమాయకంగా మేకను కొనేవాడి పాత్ర ఆయన హాస్యగుళికల్లో మచ్చుకు కొన్ని. ఇక నాటకరంగంలో భజంత్రీలుతో తన ప్రస్థానం మొదలు పెట్టారు. తోలుబొమ్మలాట, ట్రీట్‌మెంట్, పండగొచ్చింది, చల్‌చల్ గుర్రం, రైలుబండి, సిప్పొచ్చింది, గప్‌చిప్, ఎవ్వనిచే జనించు, వశీకరణం వంటి నాటికల్లో నటించారు.   
 
 ప్రొఫైల్
 అసలు పేరు: కొల్లూరు చిదంబరం
 జననం: అక్టోబర్ 10 1945
 సొంతవూరు: విజయనగరం
 తండ్రి: కొల్లూరు వెంకట సుబ్బారావు,టీచర్
 తల్లి: నాగభాయమ్మ, గృహిణి
 విద్యార్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, (విజయనగరం మున్సిపల్ హైస్కూల్) పాలిటెక్నికల్  సివిల్ విశాఖపట్నం
 వృత్తి: విశాఖ పోర్టులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
 కుటుంబం: భార్య, నలుగురు పిల్లలు (ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు)
 రంగస్థల ప్రవేశం: 1958 సంవత్సరంలో 6వ తరగతిలో ‘కోయదొర’ విచిత్ర వేషధారణ.
 తొలిచిత్రం: గొల్లపూడి మారుతీరావు రచించిన ‘కళ్లు’
 నటించిన చిత్రాలు: 300 చిత్రాలు
 
 కళాకారులకు సేవ..
 నాటకరంగ కళాకారుల కోసం 2009లో విశాఖలో 1,180 మంది కళాకారులతో ‘సకల కళాకారుల సమాఖ్య’ అనే సంస్థను స్థాపించి చిదంబరం పలు సేవలందించారు. కళలు వేరైనా కళాకారులంతా ఒకటే అని భావించి సాహిత్యం, సంగీతం, వాయిద్యం, నాట్యం, మ్యూజిక్, మిమిక్రీ, హరికథ, బుర్రకథ, చిత్రలేఖనం కళాకారులను సభ్యులుగా చేర్చుకుని వారిలో ఐకమత్యం తీసుకురాగలిగారు. పేద కళాకారులకు పింఛను, వారి పిల్లలకు ఉచితంగా స్టేషనరీ, పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రూ. 10,000 చొప్పున ప్రోత్సాహకం, కళాకారుడెవరైనా చనిపోతే.. గంటలోనే తక్షణ ఆర్థిక సాయం కింద రూ. 2,000 వారి కుటుంబానికి అందజేయడం. గుర్తింపు కార్డు చూపించిన కళాకారులకు మెడికల్ షాపుల్లో 15 శాతం డిస్కౌంట్, ల్యాబొరేటరీలో 20 శాతం డిస్కౌంట్, పబ్లిక్ స్కూళ్లలో 20 శాతం డిస్కౌంట్‌లు కల్పించి పేద కళాకారుల హృదయాల్లో చిరస్మరణీయంగా చిదంబరం నిలిచిపోయారు. విశాఖలో ఎక్కువకాలం నివసించిన ఆయన.. అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆ ప్రాంతంపై ఎనలేని మక్కువ చూపారు.

మరిన్ని వార్తలు