‘ప్రత్యేక ప్రతిపత్తే’ పరిష్కారం! | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక ప్రతిపత్తే’ పరిష్కారం!

Published Tue, Oct 20 2015 10:04 PM

‘ప్రత్యేక ప్రతిపత్తే’ పరిష్కారం! - Sakshi

రాష్ట్ర శాసనసభలు సమగ్రంగా చర్చించకుండానే ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించాయి. ఆ తరువాత వ్యక్తిగత నిర్ణయాలను డొల్లించుకుంటూ, రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసమే వరుసగా తదుపరి నిర్ణయాలు జరిగిపోయాయి. నవ్యాంధ్ర ప్రదేశ్ పునర్ నిర్మాణానికి ‘ప్రత్యేక హోదా’ (ప్యాకేజీ కాదు) ఎందుకు? ప్రత్యేక ప్యాకేజీతో తృప్తి పడవచ్చుగదా అని ప్రశ్నించేవారికి ఒకటే సమాధానం, ‘ప్రత్యేక హోదాతోనే పునర్ నిర్మాణ కార్యకలాపాలకు పరిపూర్ణత, సార్థకత సిద్ధిస్తుంది.
 
 ‘‘ప్రజలలో ఉపేక్షా భావమే చాలా డేంజర్. దేశంలో పాలకులు ప్రజల్ని గొర్రెలుగా భావిస్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారు! ఎంతగా నమ్ముతున్నా రంటే - ఎద్దు, కాడి చేబట్టంగానే తనంతట తానే వచ్చి కాడికింద తల పెట్టుతది! అట్లనే బానిసత్వానికి ప్రజలు స్వయంగా లొంగుతున్నారు! ‘గొర్రె’ అన్న రచనలో నేను అన్నాను - ‘మందలబడి మురుస్తోంది గొర్రె, తెగబలుస్తోంది గొర్రె. బయళ్ల గడ్డిని గొల్లన్నే మొలిపిస్తాండనుకుంటాంది గొర్రె. సెలయేళ్ల నీళ్లన్నీ గొల్లన్నే ఒలికిస్తాండనుకుంటాంది గొర్రె. గొల్లన్న గొంగడి బొచ్చే తన పెయినిండా మొలిపిస్తాండనుకుంటాంది గొర్రె! ఈ పరిస్థితి మారాలి, మారాలి!’’    
 - కాళోజి
 
 సమైక్య ఆంధ్రప్రదేశ్ ను అమాంబాపతు రాజకీయ నాయకులు (కేంద్రం నుంచి రాష్ట్రం దాకా) చీల్చిన ఫలితంగా రెండు రాష్ట్రాలు పలు సమస్యలతో తేరుకోలేకపోతున్నాయి. విభజన చట్టం (కేంద్రం) తెచ్చిన అనర్థాలకు పరిష్కారంగా కాంగ్రెస్ (యూపీఏ-2) తన మంత్రి మండలి సమావేశంలో చేసిన తీర్మానంలో అంశం - ఆంధ్రప్రదేశ్‌కు ‘ప్రత్యేక ప్రతిపత్తి హోదా’. కాని ఇందులోనూ జరిగిన మోసం, కేబినెట్ నిర్ణయాన్ని ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవ స్థీకరణ చట్టం’లో చేర్చకుండా తప్పించుకోవటం! మరి ఆ హామీకి కాళ్లెలా వచ్చాయి? నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఇచ్చిన నోటి మాట ద్వారా! ఆచరణలోకి రాని ‘ప్రత్యేక హోదా’ కల్పనకు అదనపు అలంకరణ- మన్మో హన్ ద్వారా సోనియా బృందం కల్పించిన సరికొత్త భ్రమ- రూ.5 లక్షల కోట్లు రాజధాని నిర్మాణానికి, ఇతర సౌకర్యాలకు ఇస్తామన్న బూటకపు ప్రక టన!
 
 అధికార పీఠాల కోసం‘ఆవురావుమంటూ’ చూస్తున్న బీజేపీ (ఎన్‌డీఏ) నాయకులు తెలుగు జాతిని చీల్చే ప్రక్రియలో భాగంగా పార్లమెంటులో ప్రవర్తించిన తీరు మరవరానిది. ‘ముందు తెలుగు జాతి విభజన ప్రక్రియను పూర్తి చేయండి, ప్రత్యేక ప్రతిపత్తి గురించి మీరు ఇచ్చిన హామీలను మేమొచ్చి నెరవేర్చేస్తాం’ అని బీజేపీ ప్రతినిధులు మూగసైగలతో ‘ఆపద్ధర్మ నీతి’ని ప్రదర్శించడాన్నీ మరచిపోలేం! అలాంటి బీజేపీతో అధికార తాపత్రయంతో చెలిమికి దూసుకువచ్చాడు చంద్రబాబు. ఆ అధికారం కోసమే రాజధాని లేని పరిశేష ఆంధ్రప్రదేశ్‌కు ఆమోదిస్తూ అంతకుముందే సమ్మతి లేఖ రాసి ఇవ్వడమూ విద్రోహ రాజకీయంలో భాగమే!
 
 భౌగోళిక పరిస్థితులు అనుకూలం కాదనే..
 ఇప్పుడు రాజధానిగా నిర్ణయించిన అమరావతి ఆకాశహర్మ్యాల నిర్మాణానికి అనువుగానిదని నిపుణులు చెబుతున్నారు. కోస్తా ప్రాంతాలలో తరచుగా భూకంపాలు సంభవించగల ప్రాంతాలలో నాలుగు, అయిదు ‘జోన్స్’ పరిధిని దాటి రెండవ, మూడవ జోన్స్‌లో చేరిన ప్రాంతంగా శాస్త్రవేత్తలు అమరావతిని అంచనా వేశారని నిపుణులు పేర్కొంటున్నారు. ‘సింగపూర్, మలేసియా, జపాన్ వంటి దేశాల రాజధానులను నదీతీరాలలో, నదీ గర్భాల మీదనే కదా నిర్మించుకున్నారు, అమరావతిలో నిర్మిస్తే ఏం ప్రమాద’మని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాని అవి దీవులు, నదీ మధ్యస్థదీవులు. వైశాల్యమూ తక్కువ, జన సంఖ్యా తక్కువే. అందుకనే జపాన్ రాజధాని టోక్యో అఖాతంలోని హాన్షూ దీవి తూర్పు కోస్తాలో కొలువు తీరాల్సి వచ్చింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ హాన్ నదిపైన, ఉత్తర కొరియా రాజధాని తేడాంగ్ నదిపైన, సింగపూర్ రాజధాని పసిఫిక్, హిందూ మహాసముద్రాల ప్రధాన వర్తక కూడలి వద్ద, మలేసియా రాజధాని కౌలాలంపూర్ మాలే ద్వీపకల్పంలోని క్లాంగ్, గోంబాక్ నదుల కూడలి వద్ద, ఇండోనేసియా రాజధాని జకార్తా నైరుతి జావా దీవిలోని సిలీవూంగ్ వద్ద, మైన్మార్ రాజధాని యాంగన్ (రంగూన్) నదిపైన వెలవవలసి వచ్చింది! భూవైశాల్యం కుదించుకుపోయి, పరిమిత జనాభా తదితర భౌగోళిక వనరులు తక్కువై, ప్రభుత్వ బంజర్లు లేనిచోట, అటవీ సంపద కునారిల్లి పోయిన దీవులకు, ప్రాంతాలకు మాత్రమే ఈ సమస్య.
 
 కాని ఈ సమస్యలు లేని రాష్ట్రాలు, దేశాల రాజధానీ నగరాల నిర్మాణం ఎక్కడ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు? పంటలు పండని మెరక భూములలో, వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నచోట, రాష్ట్రం లేదా దేశంలోని అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరాలలో భూములున్న చోట జరుగుతుందంటారు నిపుణులు. పైగా తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తవుతుందని ఇంజనీరింగ్, వాస్తు, శాస్త్రవేత్తల అంచనా. ఈ దృష్ట్యానే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర అత్యున్నత (శివరామకృష్ణన్) సాధికార కమిటీ పర్యావరణ పరిస్థితుల కారణంగా అమరావతిని రాజధానిగా అనువైన స్థలంగా పేర్కొనడానికి సాహసించలేదు. కానీ రాజధానికి మూడు ప్రత్యామ్నాయ ప్రాంతాలను ప్రతిపాదించింది. ఒకనాడు దగా పడిన రాయల సీమ ప్రాంతాన్ని కూడా కమిటీ పరిశీలనలోకి తీసుకుంది. అన్ని ప్రాంతాలకు మధ్య సమతుల్యతను పాటిస్తూ రాజధాని ప్రాంతంగా గుర్తించి, ప్రజాభి ప్రాయానికి విడిచిపెట్టిన ఆ మూడు ప్రాంతాలు:  
 
         ఉత్తరాంధ్రలో విశాఖ ప్రాంతం. కర్నూలు, అనంతపురం, తిరుపతి, కడప, చిత్తూరులతో కూడిన రాయలసీమ ఆర్క్. కాళహస్తి-నడికుడి స్పయిన్. ఇది కాళహస్తి-నడికుడి రైల్వే లైన్‌ను ఆనుకుని కొనసాగే ప్రాంతం కిందికు వస్తుంది (ఈ వరసలోనే వినుకొండ- దొనకొండ ప్రాంతమూ వస్తుంది). ఇలా, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల భావి ప్రగతికి కేంద్ర కమిటీ రూపొందించిన వివేచనాత్మక నివేదికను టీడీపీ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించింది. రాష్ట్ర శాసనసభలు సమగ్రంగా చర్చించ కుండానే ఏకపక్షంగా రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించాయి. ఆ తరువాత వ్యక్తిగత నిర్ణయాలను డొల్లించుకుంటూ, రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజ నాల కోసమే వరుసగా తదుపరి నిర్ణయాలు జరిగిపోయాయి.
 
 సింగపూర్ ప్రయోజనాలకేనా?
 ముందు వీజీఎంటీ, ఆ తరువాత సీఆర్‌డీఎమ్‌ల తతంగం ద్వారా భారీ స్థాయిలో లక్షన్నర ఎకరాలను రాజధాని నిర్మాణానికి సేకరించాలని నిర్ణయించి సుక్షేత్రాలను, 125 రకాల పంటలు, పండ్లు సమకూర్చి ఆహార భద్రతకు భరోసాగా ఉన్న కృష్ణా, గుంటూరు, గోదావరి పేద మధ్య తరగతి రైతాంగం నుంచి పంట భూములను బలవంతంగా సేకరించి వ్యవసాయంపై ఆధారపడి జీవించే లక్షలాది మంది వ్యవసాయ కార్మికుల ఉపాధికి, వేలాది మంది వృత్తిపనుల వారి ఉపాధికి చేటు తెచ్చారు. ఫలితంగా రైతాంగం వ్యవసాయ కార్మిక సంఘాలు రక్షణ కోరుతూ న్యాయ స్థానాలను ఆశ్రయించవలసి వచ్చింది. విభజన వల్లనే గాక, భూసేకరణ, భూస్వాధీనపు చట్టాల కింద కుదరకపోతే; భూ ఆర్డినెన్స్‌ల చాటున దాగి (కేంద్ర ఆర్డినెన్స్‌కు గండి పడినా) బలవంతపు బ్రాహ్మణార్థపు తతంగం సాగుతూనే ఉంది.
 
 ఇక్కడి నిపుణులు పనికిరారా?
 నిజానికి దేశీయంగా రాష్ట్రీయంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పు తున్న గొప్ప గొప్ప ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నిర్మాణ రంగ నిపుణులు, సిస్మాలజిస్టులు, అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పిన సిద్ధహస్తులైన కాంట్రాక్టర్లు, ప్రసార సాంకేతిక నైపుణ్యం కల శాస్త్రవేత్తలు ఎందరో మన మధ్య ఉన్నారు. వారి సేవలు వినియోగించుకున్న తరువాత అవసరాన్ని బట్టి మిగులు సగులు నిర్మాణాలకు, మెరుగులు దిద్దుకోవడానికి సింగపూర్, జపాన్, అమెరికా బహుళ జాతి సంస్థల వైపు మోరలు చాచేపని. కాని ఈ అవకాశాన్ని అంది పుచ్చుకోమని మొదట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం అందుకున్న సింగపూర్ బడా పెట్టుబడుల కంపెనీ ఏం చేసింది? మన మాటల్లో కాకుండా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ మాటల్లో చూద్దాం.
 
 ‘‘రాజధాని నిర్మాణపు మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో రియెల్టీ (రియల్ ఎస్టేట్)వ్యాపారానికి పది వేల ఎకరాలు కావాలని సింగపూర్ కోరింది. పది వేల ఎకరాలు ఇచ్చుకునే పక్షంలో పాలనా నిర్వహణకు సంబంధించిన ప్రధానమైన భవనాలను ఉచితంగా కట్టిపెడతామని సింగపూర్ బృంద నాయకుడు ఖోటెంగ్ ఛే చెప్పడం వల్ల, ఈ మాస్టర్ ప్లాన్ సింగపూర్ ప్రయో జనాలను, దాని భావి భారత భాగస్వామ్య పక్షాల ప్రయోజనాలనే ఎక్కువగా ఈడేర్చి పెడుతుంది గాని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాదని తేలింది. ఏతావాతా రాజధాని భవన నిర్మాణానికి అయ్యే ఖర్చుకు బరాబరి విలువ చేసే భూమి మాకు కావాలని సింగపూర్ నాయకుడు చెప్పాడు.’’
 
  పరిహారం చెల్లించాల్సిందే
ఇంతకూ నవ్యాంధ్ర ప్రదేశ్ పునర్ నిర్మాణానికి ‘ప్రత్యేక హోదా’ (ప్యాకేజీ కాదు) ఎందుకు? ప్రత్యేక ప్యాకేజీతో తృప్తి పడవచ్చుగదా అని ప్రశ్నించేవారికి ఒకటే సమాధానం, ‘ప్రత్యేక హోదాతోనే పునర్ నిర్మాణ కార్యకలాపాలకు పరి పూర్ణత, సార్థకత సిద్ధిస్తుంది. కేంద్రం ఈ అనివార్యమైన మూల్యం ఎందుకు చెల్లించుకోవాలంటే- ప్రధాన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల నాయకులంతా కలసి తెలుగుజాతి కుదురును చెల్లాచెదురు చేసినందుకు, తెలుగువారి చరిత్ర గురించిన అవగాహన, జ్ఞానం వారికి కొరవడినందుకు, ప్రజలను నిలువునా వంచించినందుకు, రాజ్యాంగంలో 2/3/4 అధికర ణలకు అవకాశవాద భాష్యాలు చెప్పినందుకు, సమగ్ర రాష్ట్ర ప్రతిపత్తి కోసం పొందుపరిచిన 371(జి) ప్రత్యేక అధికరణను తోసిపుచ్చి నిరంకుశంగా వ్యవహరించినందుకు, 2-3 అధికరణలపై గతంలోనే సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులకు, ప్రతిపాదనలకు వక్రభాష్యాలు చెప్పినందుకు, ‘రాష్ట్ర శాసన సభలదే అంతిమ తీర్పు’ అని స్పష్టం చేసిన తొల్లింటి ఐదో క్లాజును తొలగించి తెలుగువారి మెడలకు ఉచ్చులు (ఇరువైపులా) తగిలించి చిచ్చు పెట్టినందుకు ప్రత్యేక ప్రతిపత్తి పరిహారం చెల్లించక తప్పదు.
 (వ్యాసకర్త మొబైల్: 9848318414)
  - ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు

Advertisement

తప్పక చదవండి

Advertisement