విభజన హామీలను లేవనెత్తుదాం

15 Nov, 2016 02:35 IST|Sakshi

♦ కొత్త జిల్లాలకు సాయంపైనా అడగాలి
♦ పార్టీ ఎంపీలకు సీఎం దిశానిర్దేశం
♦ ముగ్గురు ఎంపీలతో భేటీ

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తొలుత పార్టీ ఎంపీలతో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభలో పార్టీ నేత జితేందర్‌రెడ్డి సోమవారం జరిగే టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాలని ఎంపీలకు సమాచారం ఇచ్చారు. కానీ సీఎం వద్ద జరగాల్సిన ఈ సమావేశం రద్దయ్యింది. ఆదివారమే ఎంపీ జితేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్‌లతో సీఎం సమావేశమయ్యారని తెలిసింది. పార్లమెంట్‌ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై వీరితో చర్చించారని సమాచారం.


హైకోర్టు విభజన, ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాల అమల్లో జరుగుతున్న జాప్యం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను సభలో టీఆర్‌ఎస్‌ లేవనెత్తనుందని సమాచారం. ప్రధానంగా కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన వివిధ సౌకర్యాల అంశాన్ని కూడా లేవనెత్తాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో రాష్ట్రాదాయానికి పడుతున్న గండిపై సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్రానికి జరుగుతున్న ఈ నష్టాన్ని కేంద్రం ఎలా భర్తీ చేయనుందో సమావేశాల్లో ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ వ్యూహాన్ని పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ఎంపీ జితేందర్‌రెడ్డి ఢిల్లీలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు