‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగుతో ...పోషకాహార భద్రత! | Sakshi
Sakshi News home page

‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగుతో ...పోషకాహార భద్రత!

Published Tue, Nov 15 2016 3:34 AM

‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగుతో ...పోషకాహార భద్రత! - Sakshi

•  ‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగుకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం
•  ‘  ‘ఏక లింగ’ తిలాపియా చేపలతో స్థానిక చేప జాతుల మనుగడకు ముప్పేమీ ఉండదు
•  ‘  మన చిన్న రైతులకు ఆహార భద్రత.. ప్రపంచ మార్కెట్లకు ఎగుమతులకూ అవకాశం
•  ‘మొజాంబిక్ తిలాపియా’ సాగుపై తెలంగాణ ప్రభుత్వ ఆంక్షలు సమంజసమే
•  ‘  వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విజేత, ప్రసిద్ధ ఆక్వా నిపుణుడు డా. విజయ్ గుప్తాతో ఇంటర్వ్యూ

 
 
చిన్న కుంటల్లో విస్తారంగా ‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగు ద్వారా చిన్న-సన్నకారు రైతులు, పేదలకు పోషకాహార భద్రతను అందించవచ్చని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్వాకల్చర్ నిపుణులు డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. చెరువుల్లో తిలాపియా సంతానోత్పత్తిని అరికట్టేందుకు మగ పిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు ఇస్తున్నందున  జీవవైవిధ్యానికి ముప్పు ఉండదన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించిన డా. గుప్తా.. ఖండాంతరాల్లో ఆక్వా దిగుబడుల పెంపుదలకు విశేష కృషి చేసి.. నీలి విప్లవ పితామహునిగా గుర్తింపు పొందారు. లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులకు ఉపకరించే చేపల సాగు పద్ధతులను రూపొందించడం ఆయన ప్రత్యేకత.  ప్రపంచ ఆహార పురస్కారాన్ని(2005), సన్‌హక్ శాంతి పురస్కారం(2015) అందుకున్నారు. వ్యవసాయక జీవవైవిధ్యంపై ఇటీవల ఢిల్లీలో జరిగిన తొలి సదస్సులో ప్రధాని మోదీ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు.  ఆక్వాకల్చర్‌పై ఏపీ ప్రభుత్వానికి గౌరవ సలహాదారుగా ఉన్నారు.
 
తిలాపియా వంటి విదేశీ జాతుల చేపల వల్ల దేశంలోని జల వనరుల్లో స్థానిక జాతుల మత్స్య సంపదకు ముప్పు వచ్చి పడిందన్న వార్తలు దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల వెలువడుతున్నాయి. మన జలవనరుల్లో సంప్రదాయ చేపల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారిందని గుర్తించి, ఈ తిలాపియా చేపల సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే, మరోవైపు తిలాపియా చేపల సాగును కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మీరేమంటారు?

ప్రపంచవ్యాప్తంగా 9 రకాల తిలాపియా చేపలు సాగులో ఉన్నాయి. అందులో మొజాంబిక్ తిలాపియా (ైట్ఛౌఛిజిటౌఝజీట ఝౌటట్చఝఛజీఛిఠట) అనే రకం చేపల సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే, కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది మరొక రకం. దాని పేరు నైల్ తిలాపియా. దాని శాస్త్రీయ నామం ైట్ఛౌఛిజిటౌఝజీట జీౌ్టజీఛిఠట . ఈజిప్ట్‌లోని నైలు నది పరీవాహక ప్రాంతంలో పెరగడం వల్ల ఆ పేరు వచ్చింది. మొజాంబిక్ తిలాపియా చేప సైజు అంతగా పెరగదు. నైల్ తిలాపియా పెద్ద సైజుకు పెరుగుతుంది. అంతర్జాతీయంగా, వాణిజ్యపరంగా గుర్తింపు పొందిన రకం ఇది. ప్రస్తుతం 170 దేశాల్లో సాగవుతోంది. ఏటా 50 లక్షల టన్నుల మేరకు ఉత్పత్తవుతోంది. దీని సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని రిజర్వాయర్లలో కేజెస్‌లో కూడా దీన్ని పెంచుతున్నారు.

నిజానికి తిలాపియా చేపలు ఆఫ్రికాలో పుట్టినవైనప్పటికీ 1950వ దశకం నుంచి మన దేశంలో ఉన్నాయి. విదేశీ చేప అయినందువల్ల తిలాపియా సాగును అనుమతించాలా లేదా అన్న తటపటాయింపు చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అనేక కమిటీలు ఏర్పడినప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.) ఐదారేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని దీనిపై నిర్ణయం తీసుకోమని కోరింది. అప్పుడు కేంద్రం నియమించిన కమిటీ నైల్ తిలాపియా సాగుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. మొజాంబిక్ తిలాపియా కాదు. అప్పుడు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మొజాంబిక్ తిలాపియా సాగుపై ఆంక్షలు విధించడం సమంజసమే.

► మత్స్య సంపద జీవవైవిధ్యానికి దీని సాగు వల్ల  ముప్పు ఉందనే విషయంపై మీ అభిప్రాయం..?
జీవవైవిధ్య పరిరక్షణ అత్యవసరమైన అంశమన్నది నా అభిప్రాయం. ఆఫ్రికాలో చాలా సదస్సులు కూడా నిర్వహించాను. అయితే, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని సాగు చేస్తే నైల్ తిలాపియా జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించదన్నది నా అభిప్రాయం. నైల్ తిలాపియా తల్లి చేపల నుంచి రూపొందించిన ‘గిఫ్ట్’ తిలాపియా చేపల సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలనే అనుసరిస్తున్నాయి. అయితే, ఇక్కడ ఉన్న ఒక సమస్య ఏమిటంటే.. మన దేశవాళీ చేపల కన్నా చాలా వేగంగా సంతతిని పెంపొందించుకునే ప్రత్యేక లక్షణం తిలాపియాకు ఉంది. అందువల్లే అవాంఛిత చేప (వీడ్ ఫిష్)గా దీనికి పేరొచ్చింది.

4,5 నెలల వయసులోనే ఇది గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. బొచ్చె తదితర కార్పు చేపలకైతే రెండేళ్లు పడుతుంది. తిలాపియా చేప వెయ్యి నుంచి 2 వేల గుడ్లు పెడుతుంది. ఏదైనా ప్రమాదం ఉందంటే పిల్లలను నోట్లో దాచుకొని కాపాడుతుంది. కాబట్టి 95 శాతం పిల్లలు బతుకుతాయి. మన చేపలు గుడ్లు పెట్టి వదిలేస్తాయి. 1 శాతం పిల్లలు మాత్రమే బతకగలుగుతాయి. అందుకని.. ఒక ఏడాదిలోనే తిలాపియా చేపల సంతతి బాగా పెరిగిపోతుంది. మొజాంబిక్ తిలాపియా, నైల్ తిలాపియా రెంటిల్లోనూ ఇదే సమస్య. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం మోనో సెక్స్ ‘గిఫ్ట్’ తిలాపియా చేప పిల్లల సాగుకు అనుమతి ఇచ్చింది.

మోనో సెక్స్ చేప పిల్లలంటే..?
చేపల జీవవైవిధ్యానికి నష్టం జరగకుండా ఉండడం కోసం మోనో సెక్స్ (ఏక లింగ) తిలాపియా చేప పిల్లల సాగుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మోనో సెక్స్ అంటే.. పిల్లలన్నీ మగవే ఉంటాయి. హాచింగ్ ప్రక్రియ మొదటి 20 రోజుల్లో పరిమిత మోతాదులో హార్మోన్లు కలిపిన మేత వేస్తారు. దీని వల్ల ఆడ పిల్లలు కూడా మగ పిల్లలుగా మారిపోతాయి. కృష్ణా జిల్లాలోని రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ ఇలా రూపొందించిన ‘గిఫ్ట్’ తిలాపియా చేపలను రైతులకు అందిస్తున్నది. మలేషియా నుంచి మేలైన నైల్ తిలాపియా తల్లి చేపలను దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా నేచురల్ సెలక్షన్ ద్వారా జన్యుపరంగా అభివృద్ధి చేసిన ‘గిఫ్ట్’ (జెనిటికల్లీ ఇంప్రూవ్‌డ్ ఫామ్ తిలాపియా) తిలాపియా పిల్లలను రైతులకు ఇస్తున్నారు (జన్యుమార్పిడి కాదు). రైతులకు ఇచ్చే గిఫ్ట్ తిలాపియా పిల్లల్లో 92 - 95 శాతం వరకు మగవే ఉంటాయి. కాబట్టి తామర తంపరగా సంతతి పెరిగే ప్రమాదం ఉండదు. కొందరు రైతులు థాయ్‌లాండ్ నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు.

లింగ మార్పిడి హార్మోన్ల వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదా?
చేప పిల్ల పుట్టిన 20 రోజుల్లోగానే మేత ద్వారా పరిమిత మోతాదులో హార్మోన్లు ఇస్తారు. ఆ తర్వాతే చేప పిల్లలు రైతులకు ఇస్తారు. ఆ తర్వాత మామూలు మేతతో పెంచుతారు. కాబట్టి వినియోగదారుల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో దీనికి మంచి ధర పలుకుతోంది. అమెరికాలో గిఫ్ట్ తిలాపియా చేప కిలో 12 డాలర్లు పలుకుతోంది.

కాబట్టి ఏ రకంగా చూసినా ‘గిఫ్ట్’ తిలాపియాను దూరంగా ఉంచాల్సిన అవసరం లేదంటారా..?
 ఏక లింగ తిలాపియా పిల్లలను రైతులకు ఇస్తున్నాం కాబట్టి భయమేమీ అవసరం లేదు. నిశ్చింతగా పెంచుకోవచ్చు, తినొచ్చు. గిఫ్ట్ తిలాపియా పిల్లల్లో కొద్ది శాతం ఆడ పిల్లలు కూడా ఉంటాయి. అందుకే, జీవవైవిధ్య పరిరక్షణ దృష్ట్యా జీవభద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలలో పేర్కొంది.

►  రైతు స్థాయిలో తీసుకునే జీవభద్రతా చర్యలు ఏమిటి?
రైతులకు ఇచ్చే ‘గిఫ్ట్’ తిలాపియా ఏక లింగ చేప పిల్లల్లో కూడా కొద్ది శాతం మేరకు ఆడ పిల్లలు కూడా ఉంటాయి. అందువల్ల చెరువుల్లో నుంచి నీటిని బయటకు (సరస్సులు, నదుల్లోకి) వదిలేటప్పుడు ఈ చేపలు బయటకు వెళ్లకుండా అరికట్టే జల్లెళ్లను ఏర్పాటు చేయమని చెబుతున్నాం. నీటిని వదిలేసిన తర్వాత చెరువుల్లో సున్నం చల్లుతారు. అప్పటికి ఇంకా చేప పిల్లలు, గుడ్లు ఏమైనా మిగిలి ఉంటే చనిపోతాయి. ఎండగట్టిన చెరువులో తర్వాత మళ్లీ ఏకలింగ చేప పిల్లలు తెచ్చి వేసి పెంచుకుంటారు. కాబట్టి సమస్య ఉండదు.

►  గిఫ్ట్ తిలాపియా చేపల సాగులో ఉన్న సౌలభ్యం ఏమిటి?
ఏక లింగ తిలాపియాలో ఆడ చేప కన్నా మగ చేప వేగంగా పెరుగుతుంది. ఏక లింగ గిఫ్ట్ తిలాపియా చేప పిల్లలు.. సాధారణ కార్పు చేపల కన్నా వేగంగా పెరుగుతాయి. చెరువుల్లో, ఇళ్ల దగ్గర కుంటల్లో మామూలుగా అయితే 5-6 నెలల్లోనే 150 - 200 గ్రాముల సైజుకు ఎదుగుతాయి. ఇంటెన్సివ్ ఫార్మింగ్‌లో అయితే 4 నెలలకే పెరుగుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో పెంచితే కిలో రూ. 50 - 60కే స్థానిక పేద ప్రజలకు అందించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి అనువైన కమోడిటీ  ‘గిఫ్ట్’ తిలాపియా. 700 - 800 గ్రాముల బరువుకు పెంచితే ఎగుమతి చేయడానికి వీలుగా ఉంటుంది. ముల్లు తీసేసి.. చేప మాంసాన్ని ఎగుమతి చేస్తారు.

►  మన దగ్గర నుంచి తిలాపియా ఎగుమతి అవుతోందా?
చాలా తక్కువండి. మనం ఇప్పుడు ప్రారంభ దశలోనే ఉన్నాం. కంటూన్యూయస్ సప్లయిస్ ఉంటేనే ఎక్స్‌పోర్ట్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. తగిన పరిమాణంలో ఉత్పత్తి పెంచడం, నాణ్యతా ప్రమాణాలు పాటించ గలిగితే తిలాపియా ఎగుమతులు చేయొచ్చు.. ఆంధ్రలో ఫిష్ ఫార్మర్స్ నిజానికి విస్తృతంగా 50 - 200 ఎకరాల్లో పెంచుతున్నారు. అందుకే వీరిని వ్యాపారవేత్తలని పిలవాలి.  ‘గిఫ్ట్’ తిలాపియా నిజానికి పావెకరం, అరెకరం, ఎకరం పొలమున్న చిన్న, సన్నకారు రైతులకు అనువైనది.

►  తిలాపియా సాగు చిన్న, సన్నకారు రైతులకు ఎలా అనువైనదంటారు?
చిన్న చిన్న కుంటలు, దొరువుల్లో కూడా వేగంగా పెంచుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులను తట్టుకునే గుణం దీనికుంది. ఆక్సిజన్ కొంచెం తక్కువగా ఉన్నా, నీటి నాణ్యత అంత బాగోలేకపోయినా పెరుగుతుంది. తక్కువ సాంద్రతలో వేసి (ఎక్స్‌టెన్సివ్ పద్ధతుల్లో) పెంచేటప్పుడు ప్రొటీన్లు అధికంగా ఉండే మేత వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకనే దీన్ని పూర్ మాన్ ఫిష్ అంటారు. కాబట్టే  ‘గిఫ్ట్’ తిలాపియాకు ‘ఆక్వాటిక్ చికెన్’ అని పేరొచ్చింది. పెరట్లో కోళ్లు సులువుగా పెంచుకుంటాం కదండి.. అలాగే దీన్ని ఇళ్ల దగ్గర చిన్న కుంట ఉన్నా నిశ్చింతగా పెంచుకోవచ్చు. పెద్ద సాంకేతిక పరిజ్ఞానం ఏమీ అక్కర్లేదు.

►  మంచినీటి కార్పు చేపలు పెరిగే దాని కన్నా తక్కువ నీటి నాణ్యత ఉన్నా సరిపోతుందా?
అవునండి. కొల్లేటి ప్రాంతంలో చేపలను మీటరున్నర - రెండు మీటర్ల లోతు నీటిలో పెంచుతుంటారు. కొంచెం ఆక్సిజన్ తగ్గినా చేపలు చనిపోతూ ఉంటాయి. తిలాపియాకు అంత సమస్య ఉండదు. అర మీటరు నుంచి మీటరు లోతు నీరున్నా, ఆ నీరు అంత నాణ్యంగా లేకపోయినా పెరుగుతాయి. వానాకాలంలో నాలుగైదు నెలలు నీళ్లుండే సీజనల్ చెరువులు కూడా తిలాపియా పంట తీసుకోవచ్చు. అప్పటికే 200 గ్రాముల బరువు వస్తుంది. చెరువు కొద్ది నెలల్లో ఎండిపోతుంది కాబట్టి జీవవైవిధ్యానికీ సమస్య ఉండదు. నీటిని సరస్సులు, నదుల్లోకి వదలకుండా జాగ్రత్తపడితే.. తెలంగాణ వంటి చోట్ల కూడా చెరువుల్లో గిఫ్ట్ తిలాపియా పెంచుకోవచ్చు.

►  చిన్న కుంటల్లో చిన్న రైతులు పెంచడానికి వీలైన చేపలు ఇంకేమి ఉన్నాయి?
మూల అనే చిన్న చేప ఉంది. విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. 3-4 అంగుళాలు పెరుగుతుంది. ఐదారు గ్రాముల బరువు పెరగ్గానే తినొచ్చు. చాలా దేశాల్లో, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆటో బ్రీడింగ్ దీని ప్రత్యేకత. చెరువులో ఒకసారి వేస్తే చాలు.. దాని సంతతి అలా పెరుగుతూనే ఉంటుంది. వారానికోసారో రెండుసార్లో కొన్ని చేపలు పట్టుకొని తింటూ ఉండొచ్చు. బెంగాల్‌లో అయితే కూరగాయలతో కలిపి గుప్పెడు చిరు చేపలు వేసి వండుకు తింటారు. అలా పేద ప్రజల్లో విటమిన్-ఎ లోపాన్ని తగ్గించడానికి మూల చేప ఉపకరిస్తుంది. ఆహార భద్రతనిస్తుంది. ఆహార భద్రత అంటే తిండి గింజలను బాగా ఉత్పత్తి చేసి, గోదాముల్లో ముక్క బెట్టడం కాదు. ప్రజలకు అందుబాటులోకి తేవాలి.

కొనుగోలు శక్తి లేని పేదలు ఇటువంటి చేపలు పెంచుకునేలా ప్రోత్సహిస్తే పౌష్టికాహార భద్రత కలుగుతుంది. పెరట్లో కుంటలో పెంచుకుంటూ ఉంటే.. సొర, బీరకాయల మాదిరిగా రోజుకు రెండు చేపలు తీసుకొని తింటూ ఉండొచ్చు. చెరువుల్లో వరి తౌడు, చిట్టు చల్లితే చాలు. కొందరు పిట్టు అంటే నూనెగింజల చెక్కను కూడా వరి తౌడులో కలిపి వేస్తుంటారు. కార్పు చేపల సాగులో మేత కూడా వేస్తుంటారు. తౌడులో ప్రొటీన్లు 8-10 % ఉంటాయి. నూనెగింజల పిట్టులో 30-35% వరకు ఉంటుంది.

►  కోస్తా తీరప్రాంతంలో భూముల్లో భూగర్భ జలాల్లోకి ఉప్పునీరు చొచ్చుకు రావడం పెనుసమస్యగా ఉంది. ఈ భూముల్లో ఉప్పు నీటితో చేపలు పెంచుకోవచ్చా?
పెంచవచ్చు. ‘గిఫ్ట్’ తిలాపియా చేప 15 పీపీటీ మేరకు ఉప్పు సాంద్రతను కూడా తట్టుకొని చక్కగా పెరుగుతుంది (సముద్రపు నీటిలో ఉప్పదనం 35 పీపీటీ మేరకు ఉంటుంది). నీటి ఉప్పదనం అంతకన్నా ఎక్కువ ఉన్నా పెరిగే ఎట్రోప్లస్ (ఉ్టటౌఞఠట), పండుగప్ప వంటి చేపల జాతులు ఉన్నాయి. హర్యానాలో సెలైన్ భూముల్లో చేపలు సాగు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ (కేంద్ర ప్రభుత్వ సంస్థ) గిఫ్ట్ తిలాపియా, పండుగప్ప పిల్లలను రైతులకు అందిస్తున్నది.

 గిఫ్ట్ తిలాపియా పిల్లలు, ఇతర వివరాల కోసం...
 బి. అప్పలనాయుడు, సహాయ ప్రాజెక్టు మేనేజర్,
 ఆర్.జి.సి.ఎ. తిలాపియా ప్రాజెక్టు, కొణతనపాడు,
 ప్రొద్దుటూరు పంచాయతీ, కంకిపాడు మండలం,
 కృష్ణా జిల్లా, ఆం. ప్ర. మొబైల్ : 98665 30366
 E mail: tilapiargca@gmail.com


 ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
 ఫొటోలు : తూనుగుంట్ల దయాకర్,
 స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సాక్షి

Advertisement
Advertisement