నాలాంటి సీఎం ఎవరూ లేరు: కేసీఆర్

17 Nov, 2015 19:39 IST|Sakshi
నాలాంటి సీఎం ఎవరూ లేరు: కేసీఆర్

వరంగల్‌: పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్  మాట్లాడుతూ... 2018 నాటికి రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తామని హామీ యిచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. తామే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. తర్వాత దశలో రూ. 4 వేల కోట్లతో 60 వేల ఇళ్లు కట్టించనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. అలాగే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, అంగన్ వాడీ కార్మికులకు జీతాలు పెంచామని గుర్తు చేశారు.

ఎన్నికల హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగనని చెప్పిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ లేరని కేసీఆర్ అన్నారు. రెండున్నరేళ్లలో వాటర్ గ్రిడ్ పథకాన్ని పూర్తి చేసి తెలంగాణ ఆడపడుచుల పాదాలు కడుగుతామన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతిపక్ష నాయకులు నోటికి తాళం లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. అడ్డం, పొడవు మాట్లాడే పార్టీలకు శిక్ష వేయాలని వరంగల్ ప్రజలను ఆయన కోరారు. ప్రతిపక్షాలకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలని, తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు