చిన్నారి ‘శ్రీమంతుడు’

18 Aug, 2015 02:18 IST|Sakshi
చిన్నారి ‘శ్రీమంతుడు’

⇒ మృత్యు ముఖంలోనూ ఊరి బాగు కోసం
⇒తపన.. ‘శ్రీమంతుడే’ స్ఫూర్తి
⇒పోలీసుల సహకారంతో బైక్‌పై షికారు చేయాలనే
⇒తన కోరికను నెరవేర్చుకున్న బాలుడు
⇒బ్యాటరీ బైక్‌పై హైదరాబాద్ రోడ్లపై షికారు

 
 హైదరాబాద్: శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబులాగా తన ఊరి బాగు కోసం కృషి చేస్తానంటున్నాడు మృత్యువుకు చేరువలో ఉన్న ఓ చిన్నారి. బ్లడ్  కేన్సర్‌తో బాధపడుతున్న ఈ బాలుడు.. బైక్‌పై షికారు చేయాలనేది తన కోరికగా చెప్పాడు. ఈ విషయం మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న పోలీసులు ఆ మేరకు సోమవారం ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలోని ఎర్రగుంట్లకు చెందిన చాకిబండ పవన్‌కుమార్ (7) అక్కడే శ్రీ చైతన్య స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు రామాంజనేయులు, అంజలితో కలసి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షల అనంతరం పవన్‌కు బ్లడ్ కేన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో అతడిని ఎంఎన్‌జీ కేన్సర్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు.

మూడు నెలల కిందట అక్కడి వచ్చిన మేక్ ఏ విష్ ఫౌండేషన్ సభ్యులకు తనకు బైక్ నడపాలని ఉందని పవన్ చెప్పాడు. ఈ విషయాన్ని వారు ట్రాఫిక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు నుంచి బ్యాటరీ బైక్‌పై పవన్ చక్కర్లు కొట్టాడు. ట్రాఫిక్ డీసీపీ ఎల్‌ఎస్. చౌహాన్, అదనపు కమిషనర్ పాపయ్య, పంజగుట్ట ఏసీపీ మాసుం బాషా, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు ఉమా మహేశ్వర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు ట్రాఫిక్‌ను నియంత్రించి బాలుడి కోరిక తీర్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... తనకు సీబీఐ ఆఫీసర్ కావాలని ఉందని, సినీ నటుడు మహేశ్‌బాబు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. శ్రీమంతుడు సినిమాలో మహేశ్‌బాబు హర్షగా.. ఊరి బాగు కోసం కృషి చేసినట్లు తాను కూడా తన గ్రామం అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపాడు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా