ఆప్‌లో ఆయన ఉన్నట్లా.. లేనట్లా?

3 May, 2017 09:01 IST|Sakshi
ఆప్‌లో ఆయన ఉన్నట్లా.. లేనట్లా?

ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం నానాటికీ మరింత తీవ్రతరం అవుతోంది. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన కుమార్ విశ్వాస్ పార్టీని వీడిపోయే లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విశ్వాస్.. ఆ మాటలు మాట్లాడించింది ఎవరో తనకు తెలుసంటూ పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వాన్నే టార్గెట్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల ప్రోద్బలంతోనే కుమార్ విశ్వాస్ వ్యవహరిస్తున్నారని ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనగురించి అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలు అందరూ చూశారని.. అలాంటి వ్యాఖ్యలే అరవింద్ కేజ్రీవాల్ మీద గానీ, మనీష్ సిసోదియా మీద గానీ చేసి ఉంటే పది నిమిషాల్లో అతడిని పార్టీ నుంచి బయటకు పంపేసేవారని, కానీ తన గురించి ఎన్నిసార్లు అతడు ఏం మాట్లాడినా పార్టీ నుంచి తొలగించలేదు సరికదా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమార్ విశ్వాస్ మండిపడ్డారు. ఇదంతా ఎందుకు జరుగుతోందో తనకు తెలుసని, అమానతుల్లా కేవలం ఒక ముసుగు మాత్రమేనని, ఆ ముసుగులో ఎవరు మాట్లాడుతున్నదీ తనకు తెలుసని అన్నారు. పరోక్షంగా ఆయన పార్టీ అగ్ర నాయకత్వం మీద విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం తాను మొదట్లో పోస్టర్లు అతికించానని, అందువల్ల తనపై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి పదవి గానీ, పార్టీ అధ్యక్ష పదవి గానీ ఏమాత్రం అక్కర్లేదని, జాతికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకు మాత్రం తగిన సమాధానం ఇస్తానని తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేలు అరెస్టయినప్పుడు అజిత్ దోవల్‌, బస్సీలతో కుమార్ విశ్వాస్ పార్టీ చేసుకున్నారని అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే.

పీఏసీ పదవికి అమనాతుల్లా ఖాన్ రాజీనామా చేసిన తర్వాత.. పార్టీ ఎమ్మెల్యేలు గానీ, ఇతర నాయకులు గానీ ఎవరూ బహిరంగంగా ప్రకటనలు చేయొద్దని, మనందరికీ పార్టీ మీద పార్టీ నాయకత్వం మీద విశ్వాసం ఉండాలని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అన్నారు. ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే నేరుగా వెళ్లి కేజ్రీవాల్‌తో మాట్లాడుకోవాలని, ఆయన ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని చెప్పారు. ఇలా బహిరంగ వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ పరువు దెబ్బ తింటుందన్నారు. కొంతమంది వ్యక్తులు పార్టీని గుప్పిట్లోకి తీసుకోవాలనుకుంటున్నారని, కుమార్ విశ్వాస్ తనతో పాటు పలువురిని బీజేపీలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారని, ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల బేరం కుదిరిందని అమానతుల్లా ఖాన్ ఆరోపించారు. దాంతో ఆయనను పార్టీ నుంచి తొలగించాలని 37 మంది ఎమ్మెల్యేలు అరవింద్ కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు