'మద్యపాన నిషేధం అసాధ్యం'

19 Aug, 2015 20:40 IST|Sakshi

సారంగాపూర్(కరీంనగర్ జిల్లా): మద్యపానం నిషేధించడం ప్రభుత్వాల బాధ్యత అయినప్పటికీ దీనిని పూర్తిగా రూపుమాపడం సాధ్యం కావడం లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మన ఊరు-మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా సారంగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. గతంలో కేరళ రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించినా సంపూర్ణంగా అమలు కాలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం గుడుంబా ద్వారా జరుగుతున్న అనర్థాలను గుర్తించిందన్నారు. గుడుంబా తాగి చాలామంది అనారోగ్యం పాలవ్వడం, మృతిచెందడం జరుగుతోందన్నారు.

వరంగల్ జిల్లా మంగపేట, ములుగు ప్రాంతాల్లో గుడుంబా వల్ల చాలా కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయూయని చెప్పారు. ఆ గ్రామాల్లో 70 శాతం కుటుంబాల్లో గుడుంబా తాగి ఇంటి పెద్ద చనిపోయి మహిళలు వితంతువులుగా మారడం తమను కలిచివేసిందని వివరించారు. గుడుంబా తాగవద్దని ప్రజలను చైతన్యవంతులను చేయడానికి వరంగల్ ప్రాంతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

మద్యపాన నిషేధం సాధ్యం కాదని, దీనిని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆరోగ్యవంతమైన తక్కువ ధరకు లభించే మద్యాన్ని ప్రవేశపెట్టనుందని తెలిపారు. చీప్‌లిక్కర్ ద్వారా గుడుంబా నియంత్రణ సాధ్యం కాకపోతే ప్రతిపక్షాలు చేసే విమర్శలతో తాను ఏకీభవిస్తానన్నారు.

>
మరిన్ని వార్తలు