ప్రేమంటే..

24 May, 2017 13:09 IST|Sakshi


ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎవరోఒకరిని ప్రేమించే ఉంటారు. అయితే కొన్ని లవ్‌స్టోరీలు మాత్రమే పాపుల్‌ కావడానికి కారణం వారివారి ప్రత్యేక పరిస్థితులే. లలిత కూడా అలాంటి స్పెషల్‌ విమెనే!

థానే చిన్నగొడవలో సొంత సోదరుడే ఆమె ముఖంపై యాసిడ్‌ పోశాడు. 17 సర్జరీల తర్వాతగానీ పరిస్థితి కాస్త చక్కబడింది. అయినాసరే లలిత తన సొంత ఊరి(యూపీలోని ఆజంగఢ్‌)లో ఉండలేకపోయింది. ముంబై శివారు కల్వా(థానే)లో గల సాహస్‌ ఫౌండేషన్‌ లలితకు ఆశ్రయం కల్పించింది. తనలాంటి బాధితురాళ్ల మధ్య లలితకు కొంత స్వాంతన లభించింది. అలా రోజులు గడుస్తుండగా ఓ రాంగ్‌కాల్‌ ఆమె జీవితాన్ని మార్చేసింది..

రాంగ్‌ నంబర్‌ ద్వారా లలిత, రవి శకంర్‌లు ఒకరికొకరు పరిచయం అయ్యారు. కొద్దిరోజులకే ఒకరినొకరు కలుసుకున్నారు. శంకర్‌.. కాందివ్లీ(ముంబై)లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సీసీటీవీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతని కుటుంబానికి రాంచీలో ఓ పెట్రోల్‌ బంకు కూడా ఉందట. పరిచయమైన తొలినాళ్లనుంచే లలితను ప్రేమించిన శంకర్‌.. పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఆమె కాదనలేకపోయింది. మంగళవారం థానేకోర్టులో చట్టబద్ధంగా పెళ్లిచేసుకున్నారు. దేశంలోని అన్ని ప్రధాన చానెళ్లు, వార్తాపత్రికలు, వెబ్‌సైట్లలో వీళ్ల పెళ్లి వార్తలు వచ్చాయి.

ముంబైలో నిర్వహించిన రిసెప్షన్‌లో మాట్లాడుతూ.. ‘అద్భుతాలు జరుగుతాయనే మాట నా జీవితంలో నిజమైంది’ అని ఏడ్చేసింది లలిత. ‘మా అమ్మను ఒప్పించడమే మిగిలింది. పెళ్లి తర్వాత ముంబైలోనే సెటిల్‌ కావాలా? లేక రాంచీకి వెళ్లాలా అన్నది లలిత ఇష్టం’ అని చెప్పాడు రవి శంకర్‌.

సాహస్‌ ఫౌండేషన్‌లో లలిత లాంటి యాసిడ్‌ బాధితులు మరో 21 మంది ఆశ్రయం పొందుతున్నారని, ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబెరాయ్‌.. మున్ముందు లలిత శస్త్రచికిత్సలకు అవసరమైన సహాయం చేస్తానని చెప్పినట్లు ఫౌండేషన్‌ ప్రెసిడెంట్‌ దౌలత్‌ ఖాన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు