చైనాలో మన సీరియళ్లకు ఫుల్ డిమాండ్!

4 May, 2017 10:43 IST|Sakshi
చైనాలో మన సీరియళ్లకు ఫుల్ డిమాండ్!

ఇటీవల రాజకీయ విభేదాల వల్ల భారత్-చైనా దౌత్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మన పొరుగుదేశంలో మన సీరియళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కిన మహాభారత్, దేవోంకా దేవ్ మహాదేవ్, నాగిన్ వంటి సీరియళ్లను చైనా వాసులు విపరీతంగా చూస్తున్నారు. దీంతో ఆ సీరియళ్లు చైనాలో సూపర్ హిట్ అయ్యాయని ఆ దేశ ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనంలో తెలిపింది.

"భారతీయ పురాణాలు నాకు ఎంతగానో నచ్చుతాయి. వాటి తత్వం, విశాల ప్రాపంచిక దృక్పథం అబ్బురపరిచేలా ఉంటాయి. అవి నాకు సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తాయి' అని 29 ఏళ్ల యాంగ్ బూహి తెలిపారు. గేమింగ్ పరిశ్రమలో పనిచేసే భుహి భారతీయ టీవీ సీరియళ్లకు చైనీస్ సబ్ టైటిల్స్ అందించే వాలంటీర్ గ్రూప్ లో పనిచేస్తున్నారు. 2011లో శివపురాణం ఆధారంగా తెరకెక్కిన దేవోంకా దేవ్ మహాదేవ్ సీరియల్ కు మొదట ఆమె పనిచేశారు.  ఈ సీరియల్ లోని మొత్తం 820 ఎపిసోడ్లకు ఆమె చైనీస్ సబ్ టైటిల్స్ అందించారు. చైనాలోకి సీరియళ్లు దిగుమతి కావడం కొత్త కాదు. అమెరికా, దక్షిణ కొరియా, బ్రిటన్, జపాన్ నుంచి దిగుమతి అయిన సీరియళ్లను వారు బాగానే ఆదరిస్తారు. కానీ ఇటీవల కొత్తగా దిగుమతి అవుతున్న భారతీయ సీరియళ్లు కూడా చైనీయులను బాగా ఆకట్టుకుంటున్నాయని ఆ పత్రిక తెలిపింది.

విద్యారంగంలో పనిచేసే క్వింగ్ క్వింగ్ (35) మాట్లాడుతూ భారతీయ నటులను నేను ఇష్టపడతాను. ఎంతగా అంటే డబ్బింగ్ చేయకుండా, చైనీస్ సబ్ టైటిల్స్ లేకుండా భారతీయ సీరియళ్లను చూస్తానని చెప్పారు. భారతీయ సీరియళ్ల అనువాదానికి చాలా సమయం పడుతుండటంతో వాటిని నేరుగా చూసేందుకు తాను ఇష్టపడతానని, సీరియళ్లలోని ప్రతినాయకులు సైతం అద్భుతంగా నటించి ఆకట్టుకుంటున్నారని ఆమె చెప్పారు.
 

మరిన్ని వార్తలు