నితీశ్‌ కల చెదిరింది కథ మారింది..

27 Jul, 2017 14:08 IST|Sakshi
నితీశ్‌ కల చెదిరింది కథ మారింది..

న్యూఢిల్లీ: బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కల చెదిరింది...కథ మారింది....ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా 2019 నాటి పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని విజయపథాన నడిపించి ప్రధాన మంత్రి కావాలనుకున్న ఆయన కల చెదిరింది. ఈ విషయంలో గత శనివారం నాడు రాహుల్‌ గాంధీతో జరిపిన మంతనాలు ఫలించలేదు. అందుకని ఆయన బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి కథను మార్చేశారు. రాత్రికి రాత్రి కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూలతో కూడిన మహా కూటమి ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పారు. బీజేపీతో కలసి కొత్త ప్రభుత్వానికి కొలువుతీశారు.

అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయిన డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ రాజీనామాకు ససేమిరా అనడం, ఆయన్ని ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వెనకేసుకు రావడం తదితర పరిణామాలే మహా కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసిందనేది అర్ధ సత్యమేనన్నది రాజకీయ పరిశీలకుల భావన. ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ఖరారు చేయడంతో సెక్యులర్‌ భావాలుగల నితీశ్‌ కుమార్‌ 2013లో బీజేపీ పొత్తుకు రాం రాం పలికారు. ఇప్పుడు మళ్లీ అదే బీజేపీతో చేతులు కలిపారు. ఈ పరిణామం కాంగ్రెస్‌ పార్టీ కలను కూడా చెదరగొట్టిందని చెప్పవచ్చు. 2019 నాటి పార్లమెంట్‌ ఎన్నికల నాటికి అవినీతికి ఆమడ దూరంగా, ముక్కుసూటిగా నడిచే వ్యక్తిగా పేరున్న నితీశ్‌ కుమార్‌ను ముందుపెట్టి ప్రతిపక్షాన్ని విజయపథాన నడిపించాలన్నది కాంగ్రెస్‌ గాంచిన కల. అసలు ఈ ఆలోచనకు, వ్యూహానికి ఊతమిచ్చిందే నితీశ్‌ కుమార్‌.

ఈ కల కార్యరూపం దాల్చితే తానే ప్రధాన మంత్రిని కావాలన్నది నితీశ్‌ కుమార్‌ కలగా రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఈ విషయంలో ఇంతవరకు ఆయనకు కాంగ్రెస్‌ పార్టీ స్పష్టత ఇవ్వలేదు. ఆ నాటి పరిస్థితిని బట్టి అప్పుడే నిర్ణయం తీసుకుందామన్నది సోనియా గాంధీ మాటగా ప్రచారమైంది. శనివారం నాడు రాహుల్‌తో జరిపిన చర్చల్లో ప్రతిపక్ష కూటమికి ఆయనే నాయకుడని స్పష్టం చేసినట్లు తెల్సింది.

13 ఏళ్ల క్రితం యూపీఏకు నాయకత్వం వహించిన సోనియాకున్న పరిణతి, నాయకత్వ లక్షణాలు ఇప్పటికీ కూడా రాహుల్‌ గాంధీకి లేవన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అదే అభిప్రాయం కలిగిన నితీశ్‌ కుమార్, ప్రధాన మంత్రి పదవి దక్కనప్పుడు ప్రస్తుతమున్న ముఖ్యమంత్రి పదవే ఎన్నో విధాల ఉత్తమమని భావించి మోదీ, అమిత్‌షాలు వేసిన స్కెచ్‌లో ఒదిగిపోయారు.

మరిన్ని వార్తలు