మళ్లీ తొడగొట్టిన ఉత్తర కొరియా!

1 May, 2017 17:59 IST|Sakshi
మళ్లీ తొడగొట్టిన ఉత్తర కొరియా!
  • ఏక్షణంలోనైనా అణ్వాయుధ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటన
  • అమెరికాకు మరోసారి సవాల్‌
  • సియోల్‌: ఉత్తర కొరియా మరోసారి అమెరికాకు సవాల్‌ విసిరింది. ఏ క్షణంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా  అణ్వాయుధ పరీక్ష నిర్వహిస్తామని హెచ్చరించింది. తాజా ప్రకటన కొరియా ద్వీపంలో ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోయనుందని భావిస్తున్నారు.

    గత కొన్నాళ్లుగా కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సుదూర ప్రాంతాలను ఢీకొట్టగలిగే సామర్థ్యమున్న క్షిపణీని ప్రయోగిస్తామని, ఆరోదఫా అణ్వాయుధ పరీక్షలు చేపడతామని ఉత్తర కొరియా ప్రకటించడం కలకలం రేపింది. ఆరో అణ్వాయుధ పరీక్ష చేపడితే.. ప్రతిగా ఆ దేశంపై సైనిక దాడులకు దిగాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. అయినా, ఉత్తర కొరియా వెనుకకు తగ్గడం లేదు.

    తాజాగా ఆ కొరియా విదేశాంగ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ దేశ నాయకత్వం నిర్దేశించిన మేరకు ఏ క్షణంలోనైనా, ఎక్కడైనా అణ్వాయుధ పరీక్షలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా తలపెట్టే ఎలాంటి చర్యనైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు. అమెరికా తన అస్త్యవ్యస్త విధానాలను మానుకోనంతవరకు తాము అణ్వాయుధ పరీక్షలు చేపడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
     

మరిన్ని వార్తలు