పాపం కేజ్రీవాల్‌.. ముప్పేట దాడి

9 May, 2017 10:08 IST|Sakshi
పాపం కేజ్రీవాల్‌.. ముప్పేట దాడి

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) తిరుగుబాబు, అసంతృప్త నేతలు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ముప్పేట దాడికి దిగారు. కేజ్రీవాల్‌ లంచాలు తీసుకున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇప్పటికే మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా.. కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేయగా తాజాగా ఆప్‌ బహిష్కృత ఎమ్మెల్యే ఆసిమ్‌ అహ్మద్‌ ఖాన్‌ కూడా ఆయన బాటలో చేరారు. కేజ్రీవాల్‌, ఆయన అనుచరులు తనను రూ. 5 కోట్లు డిమాండ్‌ చేశారని వెల్లడించారు. పార్టీని ప్రైవేటు కంపెనీలా మార్చేశారని ధ్వజమెత్తారు. పార్టీ అవినీతికి కపిల్‌ మిశ్రాను బలిపశువు చేశారని వాపోయారు. కేజ్రీవాల్‌ను వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేబుల్‌ నెట్‌వర్క్‌ను కొనేందుకు రూ. 25 కోట్లు సమీకరించాలనుకున్నారు. రూ. 5 కోట్లు ఇమ్మని నన్ను అడిగారు. మరో నలుగురు ఎమ్మెల్యేలను రూ. 5 కోట్లు చొప్పున ఇవ్వాలని కోరారు. ఈ డబ్బులు వసూలు చేసేలా మాపై ఒత్తిడి చేసేందుకు కేజ్రీవాల్‌ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. డబ్బుల కోసం మాపై బెదిరింపులకు దిగారు. నన్ను పార్టీ నుంచి గెంటేసినా డబ్బు ఇవ్వనని వారికి చెప్పాను. దీంతో నాపై అసత్య ఆరోపణలు చేసి పార్టీ నుంచి వెళ్లగొట్టారు. ఇప్పుడు కేజ్రీవాల్‌, సత్యేంద్రజైన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఎందుకు వారిపై చర్య తీసుకోలేద’ని ఆసిమ్‌ ఖాన్‌ ప్రశ్నించారు.

తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌ను ఆప్‌ పంజాబ్‌ కన్వీనర్‌ గురుప్రీత్‌ గుగ్గీ కోరారు. కేజ్రీవాల్‌పై తనకు విశ్వాసముందన్నారు.

మరిన్ని వార్తలు