యజమానిపై విశ్వాసం... రోడ్డుపైనే గంటలతరబడి శునకం..

24 Oct, 2015 23:56 IST|Sakshi
యజమానిపై విశ్వాసం... రోడ్డుపైనే గంటలతరబడి శునకం..

విశ్వాసానికి మారుపేరు శునకాలు అంటారు. యజమానిపట్ల అమితమైన ప్రేమను చూపించే జంతువుల్లో శునకాలు ముందు వరుసలో ఉంటాయి. ఒక్క పెంపుడుకుక్కలే కాదు. రోడ్డుపై పెరిగే కుక్కలు కూడ ఒక్కరోజు  ఓ చిన్న బిస్కెట్ పెడితే చాలు... ఆ మనుషుల్ని అస్సలు మర్చిపోవు. ఎక్కడ కనిపించినా గుర్తుపట్టి మరీ వాటి అభిమానాన్ని చూపిస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంటాయి. అటువంటి ప్రేమకు మారుపేరుగా నిలిచింది ఫ్లోరిడాకు చెందిన ఆ పెంపుడు జంతువు.

ఫ్లోరిడా జాక్సన్ విల్లేకు చెందిన 42 ఏళ్ళ కెల్లీ బ్లాక్.. ఆమె పెంపుడు కుక్క   ప్యాకో తో పాటు ఉదయం వాకింగ్ కు వెళ్ళింది. అయితే ఉన్నట్లుండి కెల్లీ ఆ ప్రాంతంలోని గ్యాస్ స్టేషన్ వద్ద మృతి చెందడంతో పెంపుడు కుక్క ప్యాకో చలించిపోయింది. కదలకుండా పడిఉన్న యజమానిని చూసి కన్నీరు పెడుతూ  అక్కడే రోడ్డు మధ్యలో గంటలతరబడి ఉండిపోయింది. అయితే కొంత సమయానికి ఆమె శరీరాన్ని పోలీసులు అక్కడినుంచీ తొలగించారు. కానీ  ప్యాకో మాత్రం అక్కడినుంచీ కదల్లేదు. బ్లాక్ కుటుంబ సభ్యులు వచ్చేంత వరకూ అదే రోడ్డుపై పడుకుని దీనంగా ఉండిపోయింది. ఆ సంఘటన ఎందరో గుండెల్ని పిండేసింది. ప్యాకో విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయారు.  

కెల్లీ బ్లాక్ ను ఎవరో యాక్పిడెంట్ చేసి పారిపోయి ఉండొచ్చని, డ్రైవర్ ఆడా, మగా అన్నది కూడ తెలియలేదని పోలీసులు అంటున్నారు. డ్రైవర్ కోసం, సాక్ష్యాలకోసం ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు