'తెలుగు వర్సిటీకి చేటు చేస్తే ప్రజలు సహించరు'

19 Aug, 2015 20:52 IST|Sakshi

ఆల్కాట్‌తోట(రాజమండ్రి): తెలుగు విశ్వవిద్యాలయానికి అపకారం చేస్తే ప్రజలు సహించరని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. ఆ సంస్థను కాపాడి తెలుగుతల్లి గౌరవాన్ని నిలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆనం రోటరీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగువిశ్వవిద్యాలయాన్ని అస్థిర పరిచి ఉద్యోగులను, విద్యార్థులను రోడ్డున పడేశారన్నారు. ఆంధ్రరాష్ట్రంలో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా రిలీవ్ చేసిందన్నారు.

రాష్ట్ర విభజన 10వ షెడ్యూలులో ఉన్న ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి, చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థకు లేని అడ్డంకులు తెలుగువిశ్వవిద్యాలయూనికి ఏ విధంగా అడ్డు వచ్చాయని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయం పరిరక్షణ ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేసేందుకే రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 9.00గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చైతన్యదీక్ష చేపడుతున్నామని చెప్పారు. ఈ దీక్షలో ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు పాల్గొంటారన్నారు.

మరిన్ని వార్తలు