ఆటో డ్రైవర్ కుటుంబంపై ఖాకీ క్రౌర్యం

12 Jul, 2016 15:30 IST|Sakshi
ఆటో డ్రైవర్ కుటుంబంపై ఖాకీ క్రౌర్యం

చెన్నై: ఓ ఆటో డ్రైవర్ కుటుంబంపై ముగ్గురు ఖాకీలు తమ ప్రతాపం చూపించిన వైనం సోషల్ మీడియాలో వైరల్ అయింది.  తిరువణ్ణామలై జిల్లా చెంగం లో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. 
వివరాల్లోకి   వెళితే పంచాయితీ శానిటరీ  కార్మికురాలు ఉష, ఆటో  డ్రైవర్ రాజా భార్యాభర్తలు. వీరికి సూర్య (17) కొడుకు కూడా ఉన్నాడు.   రాజా,ఉష మధ్య  స్వల్ప తగాదా రావడంతో భార్యను చెంపమీద కొట్టాడు రాజా. అనవసరంగా బంగారం   కొనుగోలు చేసిందన్నది రాజా ఆరోపణ.   వారిద్దరి మధ్య వివాదం నడుస్తుండగా అక్కడే ఉన్న ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు కల్పించుకున్నారు.  అనంతరం రాజాపై చేయి చేసుకున్నారు. విషయాన్ని రాజా వివరించే లోపే మురుగనందం, విజయ కుమార్, నమ్మాజ్వార్ అనే కాని స్టేబుళ్లు రాజాపై  విరుచుకుపడి వీరంగం సృష్టించారు .పట్టపగలు నడివీధిలో తమ ఖాకీ క్రౌర్యాన్ని ప్రదర్శించారు.  అడ్డొచ్చిన  సూర్యపైనా లాఠీ ఝళిపించారు. తన భర్తను, కొడుకుని విడిచిపెట్టమని ఉష వేడుకున్నా వినకుండా  ప్రతాపాన్ని  చూపించారు. అంతేకాదు  ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించిన అక్కడ  గుమిగూడిన వారిని కూడా లాఠీలతో చితక  బాదారు.

చివరికి బాధితులను అలాగే వదిలేసి వెళ్లిపోయారు.  స్థానికులు వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.  దీంతో ప్రమాదాన్ని పసిగట్టిన మిగతాపోలీసులు హాస్పిటల్ కు వచ్చి బాధితులతో బేర సారాలకు దిగారు. కానీ అప్పటికే  ఆ దృశ్యాలన్నీ మీడియాలో హల్ చల్ చేశాయి.  దీంతో వివాదం  ముదిరి ..పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు చేరింది.


 మరోవైపు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు, తొక్కవాది గ్రామస్తులు   పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమపై  విరుచుకుపడిన ముగ్గురు పోలీసులపైనా కేసులు  నమోదు చేయాలని కోరారు.  దీనిపై జిల్లా  ఎస్పీ ఆర్. పొన్ని ని  వివరణ  కోరగా విచారణ జరుగుతోందని, చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ముగ్గురు నిందితులను వెల్లూరు బదిలీ చేశామని..  ఈ ఘటనపై చెంగం డీఎస్పీ పూర్తి విచారణ తరువాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. దీనిపై స్థానిక ప్రజాసంఘాలు, వామపక్షపార్టీలు విమర్శలు గుప్పించాయి.

 

మరిన్ని వార్తలు