మోదీ టూర్‌: శ్రీనగర్‌లో గ్రనేడ్‌ దాడి!

2 Apr, 2017 20:29 IST|Sakshi
మోదీ టూర్‌: శ్రీనగర్‌లో గ్రనేడ్‌ దాడి!

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పాత శ్రీనగర్‌ నౌహట్టా ప్రాంతంలో ఆదివారం గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ పోలీసు మృతి చెందగా, 11 మంది పోలీసులకు గాయాలయ్యాయి. నౌహట్టా ప్రాంతంలోని గంజ్‌బక్ష పార్కు సమీపంలో పహరా కాస్తున్న పోలీసులు లక్ష్యంగా తీవ్రవాదులు గ్రనేడ్‌ దాడి చేశారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన పోలీసులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో కొందరు దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారని, ఈ క్రమంలోనే గ్రనేడ్‌ దాడి జరిగిందని అధికారులు చెప్తున్నారు.

జమ్మూకశ్మీర్‌ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉధంపూర్‌లో దేశంలో అతి పెద్దదైన చెనానీ-నష్రీ సొరంగమార్గాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఈ సొరంగ మార్గం వల్ల ప్రయాణదూరం గణనీయంగా తగ్గనుంది. ఈ సందర్భంగా ఉధంపూర్‌ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ఒకవైపు తప్పుదోవ పట్టిన కొంతమంది యువత రాళ్లు విసురుతున్నారు. మరోవైపు అకుంఠిత దీక్ష కలిగిన కశ్మీర్‌ యువత అవే రాళ్లను దేశ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. రక్తపాతం ద్వారా ఎవరూ లబ్ధిపొందరు. దానివల్ల ఎవరికీ ఎలాంటి మేలు ఒనగూడదు' అని హితబోధ చేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు