ప్రొఫెసర్ సాయిబాబాకు తాత్కాలిక బెయిల్

1 Jul, 2015 00:18 IST|Sakshi
ప్రొఫెసర్ సాయిబాబాకు తాత్కాలిక బెయిల్

ముంబై: నిషిద్ధ మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టయి జైలులో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు బాంబే హైకోర్టు బుధవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని.. వైద్య చికిత్స కోసం తాత్కాలిక బెయిల్‌పై విడుదల చేయకపోతే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తాము భావిస్తున్నామని.. అదే జరిగితే సాయిబాబా ప్రాధమిక హక్కును పరిరక్షించటంలో కోర్టు విఫలమైనట్లవుతుందని.. ప్రధాన న్యాయమూర్తి మోహిత్‌షా సారథ్యంలోని డివిజన్ బెంచ్ పేర్కొంది. అనారోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని మూడు నెలల కాలానికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

 కేవలం చక్రాల కుర్చీకే పరిమితమైన సాయిబాబాను.. రూ. 50,000 పూచీకత్తుపై విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. గత ఏడాది ఢిల్లీలో సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఆయన నాగ్‌పూర్ జైలులో ఉన్నారు. కేసు నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని వెలువడిన వార్తా కథనంతో పాటు.. సామాజిక కార్యకర్త పూర్ణిమా ఉపాధ్యాయ్ రాసిన లేఖను సుమోటో విచారణకు స్వీకరించిన బాంబే హైకోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
 

మరిన్ని వార్తలు